Trains stoppage: రేపట్నుంచి ఆ స్టేషన్లలో రైళ్లు ఆగవు, రైల్వే శాఖ నిర్ణయంతో ప్రయాణికుల్లో ఆందోళన
Trains stoppage: రేపటి నుంచి ఆ మూడు రైల్వే స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు. దీనికి కారణం ఏమిటంటే..?
Trains stoppage: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మూడు రైల్వే స్టేషన్లలో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపేజ్‌లు ఇక నుంచి ఉండవు. కారణం ఏమిటంటే ఆ మూడు రైళ్లు ఆ మూడు రైల్వే స్టేషన్లలో నిలుపుదలకు ఇచ్చిన గడువు రేపటికి (జులై 19) గడువు పూర్తి అవుతుంది. దీంతో ఆయా రైల్వే స్టేషన్లలో స్టాప్‌లను ఎత్తివేస్తూ రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
లింగంపల్లి-తిరుపతి మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (12734), సికింద్రబాద్-భూవనేశ్వర్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016), హైదరాబాద్-చెన్నై మధ్య నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్ (12604) రైళ్లు 19 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్ల, నడికుడి, తెలంగాణలోని మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో స్టాప్‌లను ఎత్తివేశారు. ఈమేరకు రైల్వే శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
ఏడాది క్రితం వచ్చిన డిమాండ్ మేరకు పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాప్‌లు ఇచ్చారు. అయితే దాని గడువు జులై 19తో ముగియనుంది. ఈ స్టాప్‌లను కొనసాగించేందుకు ప్రయత్నం చేయటం లేదు. అందువల్ల ఆ మూడు రైళ్లు ఆ మూడు రైల్వే స్టేషన్లలో నిలుపుదల చేయటాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
తొలుత కరోనా సమయంలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో ఆపకుండా రైల్వే బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, తెలంగాణలోని నల్గొండ జిల్లాల ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. దీంతో ఈ మూడు రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆపాలని కోరుతూ రైల్వే బోర్డు అధికారులను అప్పటి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.
దీంతో ఏడాది పాటు ఆ మూడు రైళ్లు, ఆ మూడు రైల్వే స్టేషన్లలో నిలుపుదలకు రైల్వే బోర్డు అధికారులు అంగీకరించారు. అప్పుడు ఇచ్చిన ఆదేశాలు జులై 19తో ముగియనున్నాయి. దీంతో రైల్వే అధికారులు ఆ స్టాప్‌లను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లకు ఆ మూడు రైల్వే స్టేషన్ల నుంచి రిజర్వేషన్‌లు ఐఆర్‌సీటీసీ అధికారులు నిలిపి వేశారు.
అలాగే సికింద్రబాద్-భూవనేశ్వర్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) రైలుకు నల్గొండలో కూడా స్టాప్ ఎత్తివేశారు. అలాగే తిరుపతి వెళ్లే మిర్యాలగూడ డివిజన్ ప్రయాణికులు లింగంపల్లి-తిరుపతి మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (12734) రైలు దిగి తెల్లవారుజామున మూడు గంటలకు బస్సుల్లో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే పిడిగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ ప్రయాణికులు కూడా ఇటు సత్తెనపల్లి, అటు నల్గొండ రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయా ప్రాంతాల ప్రజలు స్టాపేజ్‌లను కొనసాగించాలని కోరుతున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)