Stray Dogs Attack: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం...ఏడాది చిన్నారిపై వీధి కుక్క‌ల దాడి..-tragedy in ntr district stray dogs attack on one year old child ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Stray Dogs Attack: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం...ఏడాది చిన్నారిపై వీధి కుక్క‌ల దాడి..

Stray Dogs Attack: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం...ఏడాది చిన్నారిపై వీధి కుక్క‌ల దాడి..

HT Telugu Desk HT Telugu
Nov 12, 2024 08:53 AM IST

Stray Dogs Attack: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏడాది చిన్నారిపై ప‌ది వీధి కుక్క‌లు ఒక్క‌సారిగా దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న‌లో చిన్నారి మృతి చెంది, త‌ల్లిదండ్రుల‌కు క‌డుపు కోత మిగిల్చింది.

వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి
వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

Stray Dogs Attack: వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. పెనుగంచిప్రోలులోని తుపాన్ కాల‌నీలో ఉండే బాల‌తోటి గోపాల‌రావు, నాగ‌మ‌ణి దంప‌తుల‌కు ప్రేమ్ కుమార్ (ఏడాది) ఏకైక సంతానం. సోమ‌వారం ఇంటి బ‌య‌ట స్నానం చేయించేందుకు త‌ల్లి కుమారుడిని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు.

బాలుడిని అక్క‌డే ఉంచి ఆమె ఇంట్లోకి వెళ్లింది. అంత‌లోనే అక్క‌డకు వ‌చ్చిన ప‌ది వీధి కుక్క‌లు హ‌ఠాత్తుగా బాలుడిపై దాడి చేసి నోట క‌ర‌చుకుని లాక్కుపోయాయి. పంట పొలాల్లోకి తీసుకెళ్లి అక్క‌డ దాడి చేశాయి. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ల్లికి చిన్నారి క‌న‌బ‌డ‌లేదు. దీంతో చిన్నారి కోసం రోడ్డుపై ప‌రుగులు తీసింది. దూరంగా కుక్క‌ల గుంపును చూసిన స్థానికుడు ఒక‌రు క‌ర్ర‌తో వాటిని త‌రిమేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన బాలుడిని హుటాహుటిన‌ నందిగామ ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా కొద్ది సేప‌టికే క‌న్నుమూశాడు.

పెళ్లైన ప‌న్నెండేళ్ల‌కు పుట్టిన కొడుకు ఇలా అర్థంత‌రంగా మృత్యువాత‌ప‌డ‌డంతో ఆ త‌ల్లిదండ్రులు రోద‌న‌లు మిన్నంటాయి. త‌ల్లి ఆర్త‌నాదాలు అంద‌రిని విషాదంలోకి నెట్టాయి. కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. ఏడాది బాలుడిని వీధి కుక్క‌లు పొట్ట‌న పెట్టుకునే ఈ దారుణ‌మైన ఘ‌ట‌నతో పెనుగంచిప్రోలు గ్రామంలో తీవ్ర విషాదం నెల‌కొంది. గ్రామంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని గ్రామ పంచాయితీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా బాధిత తల్లిదండ్రులు తెలిపారు.

శైవ క్షేత్రాల ద‌ర్శినానికి వెళ్తూ మూడేళ్ల చిన్నారి మృతి

శైవ క్షేత్రాల ద‌ర్శినానికి వెళ్తూ రోడ్డు ప్ర‌మాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు ఢీకొట్టి చిన్నారి మృతి చెందిన ఘ‌ట‌న గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు సోమ‌వారం కేసు న‌మోదు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం త‌ణుకుకు చెందిన భ‌క్తులు ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సులో శైవ క్షేత్రాల సంద‌ర్శ‌న చేస్తోన్నారు.

ఆదివారం రాత్రి పెద‌కాకాని శివాలయం ద‌ర్శించుకొని అమ‌రావ‌తిలోని ఆల‌యానికి బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో ఆదివారం అర్థ‌రాత్రి గుంటూరు గుండారావు పేట వ‌ద్ద కుమారి త‌న మేన‌కోడ‌లు అక్ష‌ర (3) తీసుకొని రోడ్డు దాటుతున్న క్ర‌మంలో వేగంగా వ‌చ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో అక్ష‌ర‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంట‌నే స్థానికులు, కుమారి బంధువులు అక్క‌డ‌కు చేరుకుని బ‌స్సును అడ్డుకుని బ‌స్సు అద్దాలు ప‌గ‌ల‌గొట్టారు. డ్రైవ‌ర్‌పై దాడికి దిగారు.

స‌మాచారం అందుకున్న న‌గ‌రంపాలెం సీఐ వీరా నాయ‌క్‌, గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్‌లు త‌మ సిబ్బందితో హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్నారు. ఆందోళ‌న‌కారుల బారి నుంచి డ్రైవ‌ర్‌ను కాపాడారు. గాయ‌ప‌డిన బాలిక‌ను గుంటూరు స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బాలిక చికిత్స పొందుతూ సోమ‌వారం ఉద‌యం మృతి చెందింది. చిన్నారి మృతితో వారి కుటుంబ స‌భ్యులు రోధ‌న‌లు మిన్నంటాయి. పోలీసులు బ‌స్సును జ‌ప్తు చేసి డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగ‌య్య తెలిపారు.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner