Tirupati SVIMS : తిరుపతి స్విమ్స్ వర్శిటీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - వివరాలివే
Tirupati SVIMS Recruitment 2024 : పలు ఉద్యోగాల భర్తీకి తిరుపతిలోని స్విమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Tirupati SVIMS Recruitment 2024 : తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) యూనివర్శిటీ… సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్, ట్యూటర్స్ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. అడహక్ బేసిస్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
మొత్తం 35 పోస్టుల భర్తీకి సంబంధించి జూలై 10 వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జూలై 8 లోగా దరఖాస్తు పంపాలి. అది కూడా మెయిల్‌కు పంపాల్సి ఉంటుంది. హిందూ మతానికి చెందిన వారు మాత్రమే వాక్ఇన్ ఇంటర్య్వూకు హాజరయ్యేందుకు అర్హులు. ఇతర మతాలు వారు అనర్హులు.
పోస్టుల వివరాలు...రిజర్వేషన్ వివరాలు
35 పోస్టుల్లో సీనియర్ సీనియర్ రెసిడెంట్ పోస్టులు 29, ట్యూటర్స్ పోస్టులు 6ను భర్తీ చేస్తారు. 29 సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ పోస్టుల్లో అనాటమి-3 (ఓసీ-2, ఎస్‌సీ-1), బయోకెమిస్ట్రీ-2 (ఓసీ-1, బీసీ(ఏ)-1), కమ్యూనిటీ మెడిసిన్-4 (ఓసీ-2, ఎస్‌సీ-1, ఎస్‌టీ-1), డెంటిస్ట్రీ-1 (బీసీ-బీ), పోరెనిక్స్ మెడిసిన్-4 (ఓసీ-3, ఈడబ్ల్యూఎస్-1), మైక్రోబయాలజీ-4 (ఓసీ-1, ఎస్‌సీ-1, బీసీ(డీ)-1, బీసీ(ఏ)-1), పిడియాట్రిక్స్-2 (ఈడబ్ల్యూఎస్-1, ఎస్‌సీ-1), పాథాలజీ-2 (ఓసీ-1, బీసీ(బీ)-1), ఫార్మాకాలజీ-4 (ఓసీ-2, ఎస్‌సీ-1, ఎస్‌టీ-1), ఫిజియాలజీ-3 (ఓసీ-2, బీసీ(ఏ)-1) పోస్టులను భర్తీ చేస్తారు. రిజర్వేషన్ కేటగిరీ వారీగా ఓసీ-14, ఈడబ్ల్యూఎస్-2, ఎస్‌సీ-5, ఎస్‌టీ-2, బీసీ(ఏ)-3, బీసీ(బీ)-2, బీసీ(డీ)-1 పోస్టులు ఉన్నాయి.
6 ట్యూటర్స్ పోస్టుల్లో అనాటమి-2 (ఓసీ-1, ఎస్‌సీ-1), కమ్యూనిటీ మెడిసిన్-1 (ఓసీ), ఫోరెనిక్స్ మెడిసిన్-2 (ఓసీ-1, బీసీ(ఏ)-1), మైక్రోబయోలజీ-1 (ఓసీ) పోస్టులను భర్తీ చేస్తారు. రిజర్వేషన్ కేటగిరీ వారీగా ఓసీ-4, ఎస్‌సీ-1, బీసీ(ఏ)-1 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు,వేతనాలు….
సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎన్ఎంసీ గుర్తింపు పొందిన కాలేజీ, ఇన్సిట్యూట్ నుంచి పీజీ మెడిషన్ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ) చేయాలి. ఎండీ, ఎంఎస్ చేసిన అభ్యర్థులకు నెలకు రూ.80 వేలు చెల్లిస్తారు. డీఎన్‌బీ చేసిన అభ్యర్థులకు నెలకు రూ.70 వేలు చెల్లిస్తారు.
ట్యూటర్స్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన కాలేజీ, ఇన్సిట్యూట్ నుంచి ఎంఎస్‌సీ, మెడికల్ డిగ్రీ చేసి ఉండాలి. ట్యూటర్స్ కు నెలకు రూ.35 వేలు వేతనం ఇస్తారు.
సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్, ట్యూటర్స్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి. ఇంటర్వ్యూ తేదీని నాటికి వయస్సును లెక్కిస్తారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
డైరెక్ట్ లింక్….
రెసిడెంట్ డాక్టర్స్ పోస్టులకు అప్లికేషన్ ఫాం కావాలనుకునే అభ్యర్థులు ఈ డైరెక్ట్ లింక్ https://svimstpt.ap.nic.in/jobs_files/SR-appl-jul2024.pdf పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అలాగే ట్యూటర్స్ పోస్టులకు అప్లికేషన్ ఫాం కావాలనుకునే అభ్యర్థులు ఈ డైరెక్ట్ లింక్ https://svimstpt.ap.nic.in/jobs_files/Tutor-appl-jul2024.pdf పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
అభ్యర్థులు తమ ఓరిజినల్ అప్లికేషన్ కాపీని, ఇతర సర్టిఫికేట్లను జూలై 8 లోగా email id:svimsfacultyestablishment@gmail.comకి పంపాల్సి ఉంది. అభ్యర్థులు తమ ఓరిజినల్ అప్లికేషన్ కాపీ, సర్టిఫికేట్‌లతో జూలై 10 (బుధవారం) ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. వాక్ఇన్ ఇంటర్వ్యూ జూలై 10న ఉదయం 10 గంటలకు స్విమ్స్ కమిటీ హాల్‌లో జరుగుతాయని స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా తెలిపారు. ఇంటర్వ్యూ హాజరైన అభ్యర్థులకు టీఏ, డీఏలు చెల్లించబడవు. ఇతర పూర్తి వివరాలకు స్విమ్స్ అధికారిక వెబ్‌సైట్ https://svimstpt.ap.nic.in సందర్శించాలి.
తీసుకెళ్లాల్సిన ధ్రువీకరణ పత్రాలు…
ఒరిజినల్ అప్లికేషన్ ఫాం, ఎస్ఎస్‌సీ సర్టిఫికేట్, మార్కుల జాబితాతో కూడిన యూజీ డిగ్రీ సర్టిఫికేట్, మార్కుల జాబితాతో కూడిన పీజీ డిగ్రీ సర్టిఫికేట్, మెడికల్ కౌన్సిల్ గుర్తింపు సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం (ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్), ప్రభుత్వ, ఇతర సంస్థల్లో రెగ్యూలర్ బేసిస్ ప్రాతిపదికన పని చేసే అభ్యర్థులు నో అబ్జిక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ధ్రువీకరణ పత్రాలన్నీ ఒరిజినల్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం