YS Sharmila : బీజేపీ కేడీల పార్టీ- జగన్, చంద్రబాబు ఆలిబాబా అరడజన్ దొంగలు : వైఎస్ షర్మిల ఫైర్
YS Sharmila : వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3200 కి.మీ పాదయాత్ర చేశానని, అయినా కృతజ్ఞత లేకుండా తన వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇలాంటి విమర్శలకు తాను భయపడనన్నారు.
YS Sharmila : వైఎస్ఆర్, సీఎం జగన్ పాలనకు ఆకాశం, పాతాళానికి ఉన్నంత తేడా ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తిరుపతి జిల్లాలో పర్యటించిన షర్మిల...కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. వైసీపీ అధికారం తీసుకొచ్చేందుకు 3200 కి.మీ పాదయాత్ర చేశానన్నారు. అయినా కృతజ్ఞత లేకుండా తన వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తు్న్నారని ఆరోపించారు. ఇలాంటి విమర్శలకు తాను భయపడనని, పులిలాంటి వైఎస్ఆర్ కడుపున పులే పుడుతుందన్నారు. తన పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నానన్నారు. ఈ పోరాటంలో ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు.
కేడీల పార్టీ
బీజేపీపై వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. అయోధ్యలో రామమందిరం కట్టిన ప్రధాని మోదీ తిరుపతిలో ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. గతంలో తిరుపతి సభలో ప్రధాని మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ఏమయ్యిందని మోదీని ప్రశ్నిస్తున్నామన్నారు. మాట నిలబెట్టుకోని మీరూ మోదీ అవుతారా? కేడీ అవుతారా? మాట నిలబెట్టుకోని మీరు కేడీనే అవుతారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలకు మోదీ చేసింది పాపం..అన్యాయం అని దుయ్యబట్టారు. బీజేపీ కేడీల పార్టీ అన్నారు. కేడీ పార్టీకి మద్దతు తెలిపిన చంద్రబాబు, జగన్ కూడా కేడీలే అంటూ ధ్వజమెత్తారు. సీఎం జగన్, చంద్రబాబు ఆలిబాబా అరడజన్ దొంగలు ఇది పరిస్థితి అన్నారు.
వైఎస్ఆర్, జగన్ పాలనకు చాలా తేడా
వైఎస్‌ఆర్, సీఎం జగన్ పాలనకు చాలా ఉందని వైఎస్ షర్మిల విమర్శించారు. హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్‌ఆర్ హయాంలో 90 శాతం పూర్తి చేశారని, సీఎం జగన్ మిగిలిన 10 శాతం పూర్తి చేయలేకపోయారన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టులో 50 శాతం పనులు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. మరి సీఎం జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.
జగన్ మాట తప్పారు
చంద్రబాబు రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపితే, సీఎం జగన్ మూడు రాజధానులు అంటూ గందరగోళం సృష్టించారని వైఎస్ షర్మిల విమర్శించారు. సీఎం జగన్, చంద్రబాబు ప్రధాని మోడీకి ఊడిగం చేస్తున్నారన్నారు. ఏపీకి ఒక్క మేలు చేయని బీజేపీకి జగన్, చంద్రబాబు బానిసలు అయ్యారన్నారు. చంద్రబాబు, జగన్ ఏపీ ప్రజలను బీజేపీకి బానిసలు చేస్తున్నారన్నారు. ఏపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బీజేపీకి టీడీపీ, వైసీపీ వశం అయ్యాయన్నారు. ప్రత్యేక హోదాతో పాటు మద్యపాన నిషేధం ఏమైందో సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. జగన్ ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ ఏమైందో వైసీపీ నేతలు చెప్పాలన్నారు.