Anantapuram Thief: అనంతపురంలో దొంగతనానికి వెళ్లి...దొరికిపోతానన్న భయంతో పై అంతస్తు నుంచి దూకిన దొంగ
Anantapuram Thief: అనంతపురంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక దొంగ మూడుంతస్తుల మేడలోని ఒక ఇంటిలోకి దొంగతనానికి వెళ్లాడు. అయితే దొరికిపోతానన్న భయంతో పై అంతస్తు నుంచి దూకాడు. అంతే ఆ దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు.
Anantapuram Thief: అనంతపురంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక దొంగ మూడుంతస్తుల మేడలోని ఒక ఇంటిలోకి దొంగతనానికి వెళ్లాడు. అయితే దొరికిపోతానన్న భయంతో పై అంతస్తు నుంచి దూకాడు. అంతే ఆ దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటన అనంతపురం నగరంలోని శ్రీనివాసనగర్‌లో గురువారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చదల్ల గ్రామానికి చెందిన రాగే వీరనారప్ప (33) పల్లెల్లోకి వెళ్లి గుజిరీ సామాన్లు సేకరించి, వాటిని అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. మద్యానికి బానిస అయి చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవాడు.
అనంతపురం నగరం శ్రీనివాసనగర్‌లో మూడంతస్తుల మేడలో ఒక అంతస్తులో కియా కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు అద్దెకు ఉంటున్నారు. అయితే వీరనారప్ప ఆ ఇంటిపైన కన్నేశాడు. అప్పటికే చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్న వీరనారప్ప, గురువారం ఆ మూడంతస్తుల ఇంటిలో కియా కంపెనీ ఉద్యోగులు ఉంటున్న ఇంటిలోకి దొంగతనానికి వెళ్లాడు. ఎప్పుడైతే ఉద్యోగులు ఇంటిలో ఉండరో తెలుసుకుని అప్పుడు దొంగతనానికి వెళ్లాడు. గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లాడు.
అయితే అంతలోనే ఆ గదిలో ఉంటున్న ఉద్యోగులు విధులు ముంగించుకుని ఇంటికి వచ్చారు. మెట్లమార్గంలో వస్తున్న వారి బూట్ల అలికిడి పసిగట్టి, దొరికిపోతానన్న భయంతో ఇంటి వెనుక నుంచి కిందకి దిగాలని ప్రయత్నించాడు. అయితే కుదరకపోవడంతో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి దూకాడు. అక్కడ బండరాళ్లు ఉండటంతో వాటిపై పడ్డాడు. అంతే బండరాళ్లపై తల బలంగా పడటంతో తీవ్రమైన రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
దీంతో అక్కడ అలికిడి రావడంతో స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మొత్తం పరిశీలించారు. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను సేకరించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు కూడా అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. పోస్టుమార్టం పూర్తి చేసి మృతున్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)