Grievance redressal: ఏపీలో పడకేసిన ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ, పత్తా లేని పరిష్కార వేదికలు, జనం సమస్యలు గాలికి..
Grievance redressal: ఏపీలో పౌర సమస్యల పరిష్కార వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. గడప వద్దకే పాలన పేరుతో ఐదేళ్లుగా చేసిన హడావుడితో ప్రజా సమస్యలపై ఉన్న వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి . వీటిని గాడిన పెట్టాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంపై ఉంది.
Grievance redressal: ఏపీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలన్నీ ఐదేళ్లుగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా వ్యవస్థలన్నీ గాడి తప్పాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు గతంలో ఉన్న వ్యవస్థల్ని మార్చేసి కొత్త ప్రయోగాలు చేయడంతో పాత వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, విద్యుత్, సివిల్ సప్లైస్, రెవిన్యూ వంటి విభాగాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలీదు…
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో చాలా ఏళ్ల క్రితమే 103, ఆన్‌లైన్ కంప్లైంట్ రిజిస్ట్రేషపన్ వ్యవస్థలు సమర్థవంతంగా నడిచేవి. వీధి లైట్లు మొదలుకుని, డ్రెయినేజీ వ్యవస్థ, పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలపై ఫిర్యాదు చేసిన 24గంటల్లో పరిష్కరించేలా సమర్ధవంతమైన వ్యవస్థ ఉండేది.
విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా ప్రసన్న వెంకటేష్ పనిచేసిన సమయంలో పాత వాటి స్థానంలో కొత్త ప్రయోగాలు చేశారు. వాట్సప్‌లో మెసేజీ చేస్తే స్పందిస్తామని ఓ వాట్సప్ నంబర్ తీసుకొచ్చారు. ఆరంభంలో అది బాగానే పనిచేసినా ఆ తర్వాత అది కాస్త అటకెక్కింది. ప్రసన్న వెంకటేష్ తర్వాత కమిషనర్‌గా వచ్చిన స్వప్నిల్ దినకర్ ఫిర్యాదులు, పరిష్కారాలన్నీ వృధా అనుకున్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రతి సోమవారం కార్పొరేషన్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో అర్జీ పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. ఒక్క విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కంప్లైంట్ సెల్స్ విషయంలో ఇలాంటి పరిస్థితే ఉంది.
కేంద్రీకృతం చేసి, పక్కన పడేశారు….
ఒక్క విజయవాడలోనే కాదు రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను కేంద్రీకృతం చేసి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ వెబ్‌సైట్‌కు అనుసంధానించారు. దాన్నైనా సమర్ధవంతంగా నిర్వహించారా అంటే అదీ లేదు. వెబ్‌సైట్‌లలో గ్రీవెన్స్ ఆప్షన్లను పూర్తిగా నిర్వీర్యం చేశారు. దీంతో జనానికి ఫిర్యాదు చేసే అవకాశమే లేకుండా చేశారు.
1902 ఎప్పుడూ పనిచేయదంతే…
ప్రజలకు తరచూ సమస్యలు తలెత్తే ప్రభుత్వ విభాగాల్లో విద్యుత్ శాఖ కూడా ఉంటుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం మొదలుకుని, అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం 1902 పరిష్కార వేదికను చాలా కాలం క్రితమే ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది.
కరెంటు తీగలపై చెట్లు పడిపోవడం, విద్యుత్ తీగలు తెగిపోతున్న ఘటనలు అన్ని ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. విద్యుత్ సమస్యలపై తక్షణ స్పందన కోసం ఎవరైనా 1902కు ఫోన్ చేస్తే భంగపాటు తప్పదు. ఆ కాల్ సెంటర్ ఎప్పుడు పనిచేస్తుందో, ఏ సమస్యలు పరిష్కరిస్తారో ఎవరికి తెలీదు.
సచివాలయాలతో గాడి తప్పిన వ్యవస్థలు…
ప్రతి 2వేల కుటుంబాలకు ఓ ప్రభుత్వ కార్యాలయం పేరుతో వైసీపీ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజలకు నేరుగా అందిన ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ అంతు చిక్కదు. పారిశుధ్యం, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్ సరఫరా వంటి సమస్యల పరిష్కారంలో వీటి పాత్ర నామమాత్రంగా ఉంటోంది. ప్రజల ఫిర్యాదుల్ని పరిష్కరించడంలో గతంలో సిటిజన్ ఛార్టర్, నిర్ణీత కాల వ్యవధిలో ఫిర్యాదులు, దరఖాస్తులు పరిష్కరించాలానే విధానాలు అమలయ్యేవి.
గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజలు ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదని ఆర్భాటంగా చెప్పుకున్నా.. గతంలో ఉన్న వ్యవస్థల్నీ నిర్వీర్యమవ్వడం తప్ప అదనంగా వచ్చిన ప్రయోజనం ఏమి కనిపించడం లేదు. పల్లెలు, పట్టణాల్లో కొత్తగా ఇళ్లు కట్టుకునే వారి నుంచి ముక్కు పిండి వసూలు చేయడం తప్ప ప్రజలకు వీటి ద్వారా నేరుగా ఒరిగే ప్రయోజనం ఏమి ఉండటం లేదు.
గతంలో ఈ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వంటి వ్యవస్థలతో ఫిర్యాదుల్ని పరిష్కరించే వ్యవస్థలు సమర్ధవంతంగా పనిచేసేవి. మునిసిపల్ కార్పొరేషన్లు సొంతంగా నిర్వహించుకునే కంప్లైంట్ సెల్స్‌కు జవాబుదారీతనం ఉండేది. గత ఐదేళ్లలో ఈ విధానాలు పూర్తిగా అదుపు తప్పాయి. స్పందన, జగనన్నకు చెబుదాం వంటి కార్యక్రమాలతో చివరి రెండేళ్లు హడావుడి చేసినా వాటి లక్ష్యం నెరవేరలేదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ నేరుగా ప్రజల్ని కలుసుకుంటారని హడావుడి చేసినా అధికారాన్ని కోల్పోయే వరకు ఆ పని చేయలేకపోయారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్లను కూడా రద్దు చేశారు. త్వరలోనే కొత్త ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలను ఏర్పాటు చేస్తామని టీడీపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ స్థితిలో అవస్థలు పడుతున్నారు.