Kodi Kathi Case: కోడికత్తిని ఇచ్చింది వాళ్లేనన్న నిందితుడి న్యాయవాది సలీం-the lawyer alleged that it was the party that prepared the knife to attack cm jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kodi Kathi Case: కోడికత్తిని ఇచ్చింది వాళ్లేనన్న నిందితుడి న్యాయవాది సలీం

Kodi Kathi Case: కోడికత్తిని ఇచ్చింది వాళ్లేనన్న నిందితుడి న్యాయవాది సలీం

HT Telugu Desk HT Telugu
Aug 30, 2023 07:58 AM IST

Kodi Kathi Case: విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి వాడిన కోడికత్తిని సమకూర్చింది మంత్రి బొత్స మేనల్లుడేనని నిందితుడి తరపు న్యాయవాది ఆరోపించడం కలకలం రేపింది.

కోడికత్తి కేసు విచారణ
కోడికత్తి కేసు విచారణ

Kodi Kathi Case: విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌పై జరిగిన దాడికి వాడిన కోడికత్తిని సమకూర్చింది మంత్రి బొత్స మేనల్లుడేనని కోడికత్తి కేసు నిందితుడు శ్రీనావాసరావు తరపు న్యాయవాది ఆరోపించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఎయిర్‌పోర్ట్ భద్రతా అధికారి దినేష్‌కుమార్‌కు బొత్స మేనల్లుడే కత్తిని అందించారని చెప్పారు. ఈకేసులో విచారణకు హాజరైతే వాస్తవాలు వెల్లడవుతాయనే సిఎం జగన్‌ ఎన్‌ఐఏ కోర్టుకు రావడం లేదన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కోడికత్తి దాడి సంఘటనకు మంత్రి బొత్స సత్య నారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కారణమని లాయర్‌ సలీం పేర్కొన్నారు. సంఘటన జరిగిన రోజు కోడికత్తిని తీసుకొచ్చి కేసులో సాక్షిగా ఉన్న సిఐఎస్‌ఎఫ్‌ అధికారి దినేష్‌కుమార్‌కు ఆయనే ఇచ్చారని చెప్పారు.

ఆ తర్వాత నేరాన్ని జనపల్లి శ్రీనుపై నెట్టారని సలీం ఆరోపించారు. జగన్‌ విచారణకు హాజరైతే వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే కోర్టుకు రావడం లేదన్నారు. జగన్‌పై దాడి కేసులో కుట్ర, రాజకీయ కోణమే ఉందని న్యాయవాది సలీం ఆరోపించారు.

విజయవాడ నుంచి బదిలీ అయిన తర్వాత తొలిసారి కోడికత్తి కేసుపై విశాఖ ఎన్‌ఐఏ న్యాయస్థానంలో మంగళవారం విచారణ జరిగింది. రాజకీయాల కోసమే కేసును వాయిదాలు వేస్తూ సాగదీస్తున్నారని విమర్శించారు. కేసు విచారణ వేగంగా జరగడానికి 'రావాలి జగన్‌.. చెప్పాలి వాదన.. ఇవ్వాలి ఎన్‌వోసీ.. అనేది తమ వాదన అన్నారు. దాడి కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్‌ఐఏ తేల్చిందన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై కేసు విచారణ ఇన్నాళ్లు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో సాగింది. కొత్త కోర్టు ఏర్పాటైన నేపథ్యంలో విచారణను విశాఖకు బదిలీ చేయడంతో తొలిసారి విచారణ జరిగింది. వాదనల అనంతరం విచారణ సెప్టెంబరు 6కు వాయిదా పడింది. ఇప్పటివరకు విజయవాడ కోర్టులో సమర్పించిన రికార్డులను పరిశీలించి విచారణ ముందుకు తీసుకెళ్లడానికి సెప్టెంబరు 18 వరకు గడువునివ్వాలని ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సిద్ధిరాములు న్యాయస్థానాన్ని కోరారు.

పరిశీలనకు అంత సమయం అవసరం లేదంటూ సెప్టెంబరు 6కు న్యాయమూర్తి మురళీకృష్ణ వాయిదా వేశారు. తదుపరి విచారణలో నిందితుడు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినే అవకాశాలున్నాయి. మరోవైపు కోడికత్తి కేసులో విచారణకు సిఎం రావాలంటూ దళిత సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు వారిని గృహ నిర్బంధించారు. ధర్నాకు పోలీసులు ఇచ్చిన అనుమతి రద్దు చేసి దళిత సంఘాల నాయకులను గృహ నిర్బంధం చేశారు.దీనిపై వివిధ దళితసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Whats_app_banner