Tirupati Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదంలో ముగ్గురు మృతి
Tirupati Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న కంటెయినర్ లారీని వెనక నుంచి కారు అతి వేగంగా ఢీకొట్టింది.పుణ్యక్షేత్రం అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
Tirupati Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటెయినర్ లారీని వెనక నుంచి కారు అతి వేగంగా ఢీకొట్టింది. పుణ్యక్షేత్రం అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఘటన ఆదివారం తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని జాతీయ రహదారిపై జరిగింది. నెల్లూరు జిల్లా వనంతోపుకు చెందిన పది మంది తీర్థయాత్రకు వెళ్లారు. తొలిత కాణిపాకం వెళ్లి అక్కడ దేవుని దర్శనం అయిన తరువాత, అక్కడ నుంచి తమిళనాడులోని కంచి వెళ్లి దైవ దర్శనం తరువాత,అదే రాష్ట్రంలోని అరుణాచలం వెళ్లారు. దైవ దర్శనం పూర్తి అయిన తరువాత తిరిగి వస్తుండగా ఈ చిల్లకూరు వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారిపై రోడ్డు పక్కనే ఆగి ఉన్న కంటెయినర్ లారీని అతి వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది.
దీంతో కంటెయినర్ లారీ కిందకు కారు దూసుకెళ్లింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. వెన్నెల, జగదీష్, బాబు మృతి చెందగా ఏడుగురికి గాయాలు అయ్యాయి. అందులో నలుగురి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను గుడూరు ఏరియా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
సహాయక చర్యల అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తామంతా నిద్రలో ఉన్నామని, ఏం జరిగిందో తమకు తెలియదని గాయాలు పాలైన మహిళ తెలిపారు. తామంతా ఒకే కుటుంబానికి చెందిన వారిమని, మొత్తం పది మందిమి దైవ దర్శనానికి వెళ్లామని చెప్పారు. అలాగే తాము వరుస ప్రయాణాలు చేయడంతో బాగా అలసిపోయామని, అందుకే అరుణాచలంలో బయలుదేరినప్పుడు నిద్రలోకి జారుకున్నామని, మెలుకవచ్చిన తరువాత ఆసుపత్రిలో ఉన్నామని ఆమె వివరించారు. ఈ మధ్యలో ఏం జరిగిందో తనకు తెలియదని, తమ వారిని అడిగితే ఇలా రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పినట్లు ఆమె మీడియాకు వివరించారు.
మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గుడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం ప్రక్రియ ముగిసిన తరువాత మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అయితే ఆదివారం కావడంతో పోస్టుమార్టం ఆలస్యం అవుతుంది. సోమవారం పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి అయిన తరువాత, అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఆ ప్రాంతలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)