Chandrababu Remand: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ గడువు
Chandrababu Remand: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. రిమాండ్ గడువు ముగియడంతో చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచనున్నారు.
Chandrababu Remand: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు న్యాయస్థానం విధించిన జ్యుడీషియల్ రిమాండు నేటితో ముగియనుంది. సెప్టెంబర్ 10వ తేదీన చంద్రబాబుకు 14రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. రిమాండ్ గడువు ముగియడంతో తదుపరి ఆదేశాల కోసం ఆయన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నేడు హాజరు పరచనున్నారు.
ఇదే కేసులో చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజే తీర్పు వెలువడనుంది. చంద్రబాబు రిమాండ్ గడువు ముగియడం, సిట్ కస్టడీ పిటిషన్లపై తీర్పులు వెలువడనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.
మాజీ సిఎం చంద్రబాబు కోసం 8 మంది వైద్యాధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం శుక్రవారం ఉదయం 8.30 గంటలకల్లా రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని క్యాజువాలిటీ వద్ద హాజరుకావాలని ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.లక్ష్మీసూర్యప్రభ గురువారం ఆదేశాలు జారీచేశారు. అత్యవసర మందులు, రెండు యూనిట్ల ఓ పాజిటివ్ రక్తాన్ని సిద్ధంగా ఉంచుకుని చంద్రబాబును ఫాలో అవ్వాలని సూచించారు. కాన్వాయ్ టీం, ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు... అంబులెన్స్‌లు సహా కేంద్ర కారాగారం వద్ద రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ డీఎస్పీకి రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.
కస్టడీ పిటిషన్‌పై తీర్పు….
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో అరెస్టయి ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారానికి వాయిదావేసింది. గురువారం ఉదయమే ఈ తీర్పు ఇవ్వాల్సి ఉండగా.. సాయంత్రం ఇస్తామని న్యాయమూర్తి హిమబిందు సీఐడీ, చంద్రబాబు తరఫు న్యాయవాదులకు తెలియజేశారు. సాయంత్రం బెంచ్ మీదకు వచ్చిన తర్వాత హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న క్వాష్ పిటిషన్ గురించి ఇరుపక్షాల న్యాయవాదులను ప్రశ్నించారు.
క్వాష్ పిటిషన్‌పై ఇప్పట్లో తీర్పు వెలువడే అవకాశం లేదని సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద తెలిపారు. దానితో సంబంధం లేకుండా కస్టడీ పిటిషన్‌పై ఆదేశాలివ్వాలని కోరారు. ఇదే ప్రశ్నను తర్వాత చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ను కూడా అడిగారు. తీర్పు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తామేమీ చెప్పలేమని ఆయన బదులిచ్చారు.
హైకోర్టు తీర్పును బట్టి తన తీర్పును వెలువరిస్తానంటూ న్యాయమూర్తి శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్ కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన రెండు పీటీ వారెంట్లు శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణకు రానున్నాయి. చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని, రిమాండ్ అక్రమమని దాఖలు చేసిన ‘క్వాష్’ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో నిర్ణయం వెలువడాల్సి ఉంది.
ఈ పిటిషన్‌లపై వాదనలు విన్న అనంతరం... న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి రెండు రోజుల్లో తీర్పు వెలువరిస్తానని మంగళవారం తెలిపారు. ఈ కేసుల్లో శుక్రవారం తీర్పు వెలువడాల్సి ఉంది. శుక్రవారం హైకోర్టుకు ముందుకు వచ్చే కేసుల జాబితాలో క్వాష్ పిటిషన్ కేసు లేదు. శనివారం కూడా హైకోర్టు పని చేయనుండటంతో హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది