CBN Pawan In Ayodhya: అయోధ్యలో చంద్ర బాబు, పవన్ కళ్యాణ్
CBN Pawan In Ayodhya: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
CBN Pawan In Ayodhya: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆదివారం రాత్రే అయోధ్య చేరుకున్న చంద్రబాబు వెంట ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు. రామ మందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో అదృష్టం ఉంటే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడగలిగే భాగ్యం దక్కినట్టు చెప్పారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అయోధ్యలో రామమందిర కల సాక్షాత్కారమైందని పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఘట్టం కోసం కోట్లాది భారతీయులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 1గంటకు ముగియనుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దాదాపు 7వేల మంది అతిథులు పాల్గొనే ఈ మహాఘట్టాన్ని కోట్లాది ప్రజలు టీవీలు/ఆన్‌లైన్ వేదికల్లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పలు హిందూ ధార్మిక సంస్థలు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.