AP Assembly Sessions : అసెంబ్లీలో ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై రగడ
ycp vs tdp in ap assembly: ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెంటనే టీడీపీ సభ్యులు నినాదాలు చేపట్టారు. ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పునకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
tdp protest in ap assembly: ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై అంశం సభలో పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఐదో రోజు సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేపట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నోత్తరాలు చేపట్టగా... ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని ప్రశ్నించారు.
స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చొద్దంటూ నినాదాలు చేశారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ తెలిపారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది. కొద్దిసేపు సభను వాయిదా వేసిన స్పీకర్... తిరిగి ప్రారంభించారు. మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఓ దశలో టీడీపీ ఎమ్మెల్యేలు పేపర్లు చించి స్పీకర్ పైకి విసిరారు. టీడీపీ ఎమ్మెల్యేల పై ప్రవర్తన తో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెల్ లోకి వెళ్లారు. పరిస్థితి గందరగోళంగా మారటంతో సభను వాయిదా వేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి అంబటి, కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ... అసలు ఎన్టీఆర్ పేరు ఉచ్చరించే అర్హత టీడీపీకి లేదన్నారు. ఎన్టీఆర్ ను మోసం చేసి పార్టీని లాకున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఫైర్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ అంటే తమకు కూడా గౌరవం ఉందని, అందుకే ఓ జిల్లాకు కూడా పేరు పెట్టామని చెప్పారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. వైద్య వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు.
ఇక వర్శిటీ పేరు మార్పునకు సంబంధించిన బిల్లు బుధవారం అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. సభ ఆమోదం తెలిపితే పేరు మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఎన్టీఆర్ వర్శిటీ పేరు వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. 1986 నవంబర్ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1996లో ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చారు.
చంద్రబాబు ఆగ్రహం
పేరు మార్పునపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తాజా నిర్ణయం జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ ప్రభుత్వం.. ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని దుయ్యబట్టారు.