AP Health University: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు!
NTR Health University: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ హెల్త్ పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది.
ntr health university name change as ysr health university: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం.... మూడు దశాబ్దాలకు పైగా వైద్యవిద్యను అందిస్తోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ వర్శిటీ పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చకచక పావులు కదిపేస్తోంది.
సభ ముందుకు బిల్లు...!
ఇక వర్శిటీ పేరు మార్పునకు సంబంధించిన బిల్లు బుధవారం అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. సభ ఆమోదం తెలిపితే పేరు మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఎన్టీఆర్ వర్శిటీ పేరు వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుతుంది.
రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నీ ఆయా జిల్లాల్లోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండేవి. వాటి ద్వారానే విద్యార్థులకు డిగ్రీల అందజేసేవారు. వైద్య, దంతవైద్య, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలకు అనుమతులు, కోర్సుల ఫీజుల వంటివి అన్ని కూడా వర్శిటీ పరిధిలోనే జరిగేవి.
ఎన్టీఆర్ సర్కార్ నిర్ణయం..
ఎన్టీఆర్ హయాంలో వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. దీంతో 1986 నవంబర్ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1996లో ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చారు. ఇటీవలే వర్సిటీ పేరిట ఉన్న 400 కోట్లను సైతం ప్రభుత్వం తీసుకున్నట్లు వార్తలు రావటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ తాజా నిర్ణయం కూడా హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే సందర్భంగా ఎలాంటి ప్రకటన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.