Chandrababu: జగన్ ప్రభుత్వానివి నవ రత్నాలు కాదు నవఘోరాలు
chandrababu fiers on ysrcp govt: చిత్తూరు జిల్లా నగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం నవరత్నాలు కాదు...నవ ఘోరాలకు పాల్పడుతోందని విమర్శించారు.
chandrababu fiers on ys jagan: జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లా నగరి రోడ్ షోలో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వ బాదుడుపై ప్రశ్నించడానికి రోడ్ షోకు వచ్చానని చెప్పారు. అద్దె మనుషులతో వైసిపి ప్లీనరీ నడుస్తోందన్న ఆయన.. జగన్ ప్రజల్లోకి వస్తే ప్రజల ఆగ్రహం అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు.. జగన్ పులివెందులలో కూడా పరదాలు, బారికేడ్లు పెట్టుకుని తిరుగుతున్నారని.. ఒకప్పుడు పాదయాత్ర అని ఇంటింటికి వెళ్లి పెట్టిన ముద్దులు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఎక్కువ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అక్రమాల వల్లే ఏపీలో మద్యం ధరలు పెరిగాయన్న చంద్రబాబు... రాష్ట్రంలో అమ్ముతున్న మద్యంలో విష పదార్థాలు ఉన్నాయని ఆరోపించారు. హానికర మద్యంపై రాష్ట్ర ప్రజలకు ప్లీనరీలో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చెత్తపై కూడా పన్ను వేస్తారా..?
జగన్ వచ్చిన తరువాత రాష్ట్రంలో కరెంట్ చార్జీలు ఆరు సార్లు పెరిగాయి. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా ఏపీలో తగ్గించలేదు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే...టీడీపీ మహానాడుకు భారీగా జనం వస్తున్నారు. చెత్తపన్నుపై చెత్త వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. 15 శాతం ఇంటి పన్ను పెంచి భారం వేశారు. చేనేతకు రావాల్సిన విద్యుత్ సబ్సిడీ ఏపీలో ఎందుకు రావడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేతలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం. 3000 పించన్ ఇస్తాను అన్నాడు...కానీ ఇప్పటికీ 2500 మాత్రమే ఇస్తున్నాడు. ఒంటరి మహిళల పెన్షన్ కూడా నిలిపివేశారు. నగరిలో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత టెక్స్ టెయిల్ పార్క్ తీసుకువస్తాం. ప్రభుత్వం ఏమీ తేవడం లేదు కానీ....అందరి జేబులకు కన్నం పెడుతుంది. మన గ్రామంలో చిన్న డ్రైనేజ్ కాలువ కట్టలేని సీఎం మూడు రాజధానులు కడతాడా..? నేను ఉంటే పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు ఇచ్చే వాడిని. హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ, ప్రాజెక్టులు కూల్చి వేసి ఉంటే అభివృద్ది జరిగేదా..? నా మీద కోపంతో అమరావతి ఆపేశారు..ఇది న్యాయమా..? రాష్ట్రంలో ఇసుక ఎందుకు దొరకడం లేదు....ప్రజలు ఆలోచించాలి - చంద్రబాబు, టీడీపీ అధినేత
రాష్ట్రంలో 10 వేల స్కూళ్లు మూసివేశారన్నారు చంద్రబాబు. అమ్మఒడి బూటకం అని ఆరోపించారు. 10వ తరగతి ఫలితాల్లో దారుణ ఫలితాలు వచ్చాయని.. ఇంటర్ లోనూ అదే జరిగిందన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యి 18 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు...ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని దుయ్యబట్టారు. వివేకా హత్య విషయంలో తనపై తప్పుజు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 600 మంది పై కేసులు పెట్టారని...180మందిని అరెస్టు చెప్పారు.
క్విట్ జగన్.. సేవ్ ఏపీ
'జగన్ అందరినీ వాడుకున్నాడు వదిలేశాడు...తల్లిని, చెల్లిని వాడుకుని వదిలేశాడు.వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఉంటారంట....ఇదేమి నిర్ణయం. మూడేళ్లలో అవినీతి ద్వారా జగన్ లక్షా 75 వేల కోట్లు సంపాదించాడు.భారతీ సిమెంట్ కోసం రాష్ట్రంలో సిమెంట్ ధర పెంచారు. 51 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చెయ్యడం లేదు. మైనారిటీ ఆడబిడ్డల కోసం దుల్హన్ పథకం తెస్తే...జగన్ రద్దు చేశాడు. జగన్ 100 శాతం హామీలు అమలు చెయ్యడం కాదు....100 శాతం మోసం చేశాడు. జిల్లాల ఏర్పాటుపై జరిగిన తప్పులు సరిదిద్దుతా. నగరి తిరుపతిలో ఉండాలి అంటే అక్కడే ఉంచుతా. మోటార్లకు మీటర్లు పెడితే రైతులు అంగీకరించవద్దు. మీటర్లపై పోరాడండి...నేను అండగా ఉంటాను. నాకు జగన్ మీద కోపం కాదు....రాష్ట్రం మీద ప్రేమ. క్విట్ జగన్...సేవ్ ఆంధ్ర ప్రదేశ్' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.