Muchumarri Case : ముచ్చుమర్రి కేసులో అనూహ్య ఘటన - విచారణలో ఉన్న వ్యక్తి మృతి, ఏం జరిగిందంటే..?-suspect in muchumarri mystery case dead in police custody latest updates read here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Muchumarri Case : ముచ్చుమర్రి కేసులో అనూహ్య ఘటన - విచారణలో ఉన్న వ్యక్తి మృతి, ఏం జరిగిందంటే..?

Muchumarri Case : ముచ్చుమర్రి కేసులో అనూహ్య ఘటన - విచారణలో ఉన్న వ్యక్తి మృతి, ఏం జరిగిందంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 21, 2024 08:37 AM IST

Muchumarri Incident Mystery : ముచ్చుమర్రి బాలిక కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. విచారణలో ఉన్న హుసేని అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీనిపై జిల్లా ఎస్పీ ప్రకటన చేశారు.

ముచ్చుమర్రి కేసు
ముచ్చుమర్రి కేసు

Muchumarri Incident Mystery : ముచ్చుమర్రి బాలిక కేసులో అనూహ్య పరిణామం వెలుగు చూసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో హుసేని అనే వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ పరిణామంపై అనేక వార్తలు రాగా… జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు.

yearly horoscope entry point

బాలిక హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఓ మైనర్ బాలుడికి హుసేని అనే వ్యక్తి మేనమామ అవుతాడు. కేసు విచారణలో భాగంగా ఇతడిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే అతను శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అస్వస్థతకు గురవటంతో అతడిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చే క్రమంలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వెనువెంటనే హుస్సున్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత… కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం రాత్రి స్వగ్రామమైన ముచ్చుమర్రిలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

జిల్లా ఎస్పీ ప్రకటన…

పోలీసుల విచారణలో ఉన్న హుసేని ఎలా చనిపోయాడనే దానిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. వివరాలను బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవటంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై జిల్లా ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా శనివారం రాత్రి క్లారిటీ ఇచ్చారు.

ఈ కేసు విచారణలో భాగంగా హుసేనిని మసీదుపురం మెట్ట వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నందికొట్కూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో పోలీస్‌ జీపులో నుంచి దూకి పారిపోయేందుకు హుసేని ప్రయత్నించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతనికి గాయాలయ్యాయని తెలిపారు. నంద్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని వివరించారు. ఆత్మకూరు ఆర్డీవో ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేశామని ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి మిడుతూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. మొత్తం పోస్టుమార్టం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించినట్లు వివరించారు. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

కేసు వివరాలు….

నంద్యాల జిల్లా ప‌గిడ్యాల మండ‌లం ముచ్చుమ‌ర్రి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం, ఆపై హ‌త్యకు గురైంది. జులై 7న తోటి స్నేహితుల‌తో క‌లిసి పాత ముచ్చుముర్రి లోని పార్కులో ఆడుకున్న చిన్నారి అదృశ్యం అయింది. దీంతో సాయంత్రం నుంచి త‌న బిడ్డ క‌నిపించ‌డం లేద‌ని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో బాలిక అదృశ్యం అయిన‌ట్లు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఒంట‌రిగా పార్కులో ఉన్న బాలిక‌ను ముగ్గురు బాలురు ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, ఆ పై కాలువ‌లోకి తోసేసి హ‌త్యకు పాల్పడిన‌ట్లు పోలీసులు ముందు భావించారు. 14-16 ఏళ్లలోపు వ‌య‌సున్న ఈ ముగ్గురు బాలురు అత్యాచారం చేసిన విష‌యాన్ని బాలిక ఇంట్లో చెబుతుంద‌న్న భ‌యంతోనే గొంతు నులిమి హత్య చేసి కాలువ‌లోకి తోసేసిన‌ట్లు ముందు చెప్పారు. ఆ తర్వాత ఊరి సమీపంలోని స్మశానంలో పాతిపెట్టినట్లు చెప్పారు. చివరికి రాళ్లు కట్టి కృష్ణా నదిలో పడేశామని చెప్పారు. దీంతో పోలీసుల బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.

ఈ కేసులో ముగ్గురు బాలురు మీద ఏ1, ఏ2, ఏ3 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరికి సహాయం చేసిన బాలురి బంధువులలో ఇద్దరు మీద ఏ4, ఏ5 కేసులు నమోదయ్యాయి. బాలిక మృతదేహం కోసం శ్రీశైలం రిజర్వాయర్ లో గాలించినప్పటికీ దొరకలేదు. బాలిక మృతదేహం దొరికే వరకూ గాలింపు చర్యలు కొనసాగుతాయని పోలీసులు ప్రకటించారు. ఈ కేసు ఏపీలో సంచలనంగా మారింది.

Whats_app_banner