Prakasam District : ప్రకాశం జిల్లాలో దారుణం - పెంచుకున్న చిన్నారి హత్య, తల్లిదండ్రులే హంతకులు..!
Step Daughter Murder in Prakasam : పెంచుకోవడానికని తెచ్చుకున్న చిన్నారిని సవతి తల్లిదండ్రులు హతమార్చారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం కుమ్మరి వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Prakasam District Crime News : నవ మాసాలు మోసింది లేదు. పురిటి నొప్పులు భరించింది లేదు. కానీ అమ్మ, నాన్న అని పిలుపునకు నోచుకున్నారు. చిన్నారి నోటి నుంచి అమ్మా, నాన్నా అని పిలిపించుకుంది. ఆ తల్లిదండ్రులకు తొమ్మిదేళ్ల పాటు పెంచిన అనుబంధం గుర్తుకు రాలేదు.
ఆస్తిపై మక్కువతో అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతురినే అత్యంత కిరాతకంగా కత్తితో గొంతె కోసి హత్య చేశారు. ఆ చిన్నారి ప్రాణాలు వదిలాక తమకేమీ తెలియదన్నట్లు భుజానికెత్తుకుని ఆర్తనాదాలు చేస్తూ ఆసుపత్రికి పరుగులు తీశారు. రక్తి కట్టించిన ఈ నాటకంలో తల్లిదండ్రులు పాత్రను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. కానీ అబద్ధాన్ని దాయలేరని ఆ తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. తల్లిదండ్రులిద్దరినీ పోలీసుకు అరెస్టు చేశారు.
ప్రకాశం జిల్లా అర్థవీడు మండల కేంద్రంలోని కుమ్మరివీధిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చకాయల వెంకట రమణారెడ్డి, ఆయన భార్య లక్ష్మీ పద్మావతి నివాసం ఉంటున్నారు. వారికి పిల్లలు కలగకపోవడంతో రాచర్ల మండలం అనులవీడులో నివాసం ఉంటున్న వెంకట రమణారెడ్డి తమ్ముడు వెంకట రంగారెడ్డి చిన్న కూతురు శాన్విరెడ్డి (9) తొమ్మిదేళ్ల క్రితం దత్తత తీసుకుని పెంచుకున్నారు. అయితే ఇటీవలి అన్నదమ్ములు వెంకట రమణారెడ్డి, వెంకట రంగారెడ్డి మధ్య ఆస్తి తగాదాలు చోటు చేసుకున్నాయి.
మరోవైపు ఈ మధ్యకాలంలో శాన్విరెడ్డి కూడా కన్న తల్లిదండ్రులపై మమకారం చూపుతున్నట్లు గుర్తించిన సవతి తల్లి లక్ష్మీ పద్మావతి జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఆ చిన్నారిని అంతమొందించాలని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆ చిన్నారి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఫోన్ చూస్తూ పడక గదిలో ఉంది. సవతి తల్లి పద్మావతి ఆ చిన్నారి ముఖంపై దిండు పెట్టి కత్తితో గొంతు కోసింది. కతగతిని మరుగుదొడ్లలో దాచింది. రక్త స్రావం కాకుండా కర్చీపును అడ్డు పెట్టి దాన్ని పింగాణి పాత్రలో పడేసింది. భార్య ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తి చేస్తే, భర్త రమణా గెటు వద్ద కాపలా ఉండి ఇంట్లోకి ఎవరూ రాకుండా చూసుకున్నాడు.
బయట వ్యక్తులు ఎవరో ఫోన్ కోసం చిన్నారిని హత్య చేసుంటారని బంధువులను, కుటుంబ సభ్యులను నమ్మించాలని హంతక తల్లిదండ్రులు ఇద్దరూ ప్రయత్నించారు. చిన్నారి ప్రాణాలు విడిచాక రమణారెడ్డి భుజనికి ఎత్తుకుని కేకలు వేస్తూ ప్రైవేట్ ఆసుపత్రికి పరుగులు తీశాడు. ఆయనతో ఆయన భార్య పద్మావతి కూడా ఉన్నారు.
అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచింది. చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులిద్దరూ తమకు ఏం తెలియనట్లు కన్నీరు మున్నీరు అయ్యారు.
చిన్నారి కన్న తండ్రి వెంకట రంగారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంకట రమణారెడ్డి, పద్మావతిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఇద్దరూ చిన్నారిని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
దీంతో కుంభం సీఐ రామకోటయ్య కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. 48 గంటల్లో కేసును చేధించిన సీఐ రామకోటయ్య, అర్థవీడు ఎస్ఐ అనిత, కుంభం ఎస్ఐ రాజేష్, బేస్తవారిపేట ఎస్ఐ నరసింహరావును మార్కాపురం డిఎస్పీ బలసుందరరావు అభినందించారు. అలాగే కుంభం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ బాలసుందరరావు కేసు వివరాలను వెల్లడించారు.