ANU Spot Admissions 2024 : ఏఎన్‌యూలో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు - ఇదే చివ‌రి ఛాన్స్..!-spot admissions to pg courses in acharya nagarjuna university 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anu Spot Admissions 2024 : ఏఎన్‌యూలో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు - ఇదే చివ‌రి ఛాన్స్..!

ANU Spot Admissions 2024 : ఏఎన్‌యూలో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు - ఇదే చివ‌రి ఛాన్స్..!

HT Telugu Desk HT Telugu
Oct 20, 2024 08:51 AM IST

ఏఎన్‌యూలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయింది. ఏపీ పీజీ సెట్-2024లో ర్యాంకులు పొందిన వారు ఈ ప్రవేశాలకు అర్హులవుతారని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 21న ఉదయం 9.30 నుంచి 11.30వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.

పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు 2024
పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు 2024

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) గుంటూరులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల డైరెక్టర్ పి. బ్రహ్మాజీరావు తెలిపారు. ఏపీ పీజీ సెట్-2024లో ర్యాంకులు పొందిన వారు ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. ఎంకామ్, ఎంఏ, ఎంఈడీ, ఎంఎస్సీ కోర్సులకు యూనివ‌ర్శిటీ క్యాంపస్ కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు.

ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు యూనివ‌ర్శిటీ క్యాంప‌స్‌లోనే ఈనెల 21న ఉదయం 9.30 నుంచి 11.30వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ప్రవేశాలు పొందే విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకురావాలని సూచించార. యూనివ‌ర్శిటీలో ఉన్న ఖాళీ సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు వివరాలకు యూనివ‌ర్శిటీలోని అడ్మిషన్ల కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.

ఉర్ధూ యూనివ‌ర్శిటీలో స్పాట్ అడ్మిష‌న్లు:

క‌ర్నూలులోని డాక్ట‌ర్ అబ్దుల్ హ‌క్ ఉర్దూ యూనివ‌ర్శిటీలో 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హిస్తున్నామ‌ని యూనివ‌ర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ వి.లోక‌నాథ్ తెలిపారు. యూనివ‌ర్శిటీలో ఎంఏ ఇంగ్లీష్‌, ఎంఏ ఎక‌నామిక్స్‌, ఎంఏ ఉర్దూ, ఎంఎస్సీ కంప్యూట‌ర్ సైన్స్‌, ఎంఎస్సీ బోట‌ని, ఎంఎస్సీ జువాల‌జీ, ఎంఎస్సీ ఇండ‌స్ట్రియ‌ల్ కెమిస్ట్రీలో విద్యార్థుల‌కు స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.

ఈనెల 19 నుంచి 24 వ‌ర‌కు విద్యార్థులు త‌మ ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్ల‌తో యూనివ‌ర్శిటీ అడ్మిష‌న్ల కార్యాల‌యంలో హాజ‌రై అడ్మిష‌న్ పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు. బాలిక‌ల‌కు యూనివ‌ర్శిటీలో హాస్ట‌ల్ వ‌స‌తి క‌ల్పిస్తామ‌ని, అలాగే బాలుర‌కు క‌ర్నూలు న‌గ‌రంలో ప్ర‌భుత్వ సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో వ‌స‌తి స‌దుపాయం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. మ‌రిన్ని వివ‌రాల కోసం ఫోన్ నంబ‌ర్లు 8341511632, 9959758609ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

ఎన్ఆర్ఐ కోటా మాన్యువ‌ల్ కౌన్సెలింగ్‌:

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్య‌వ‌సాయ యూనివ‌ర్శిటీ ప‌రిధిలోని కాలేజీల్లో మూడో ద‌శ ఎన్ఆర్ఐ మాన్యువ‌ల్ కౌన్సెలింగ్‌, బీఎస్సీ క‌మ్యూనిటీ సైన్స్ మాన్యువ‌ల్ కౌన్సిలింగ్‌ను ఈనెల 22, 23 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు యూనివ‌ర్శిటీ రిజిస్ట్రార్ జి.రామ‌చంద్ర‌రావు తెలిపారు.

కౌన్సిలింగ్‌ను ఉద‌యం 10 గంట‌ల నుంచి కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ యూనివ‌ర్శిటీ అడ్మిన్ ఆఫీస్‌, లాంఫాంలో నిర్వ‌హిస్తార‌ని తెలిపారు. ఇప్ప‌టిక‌కే ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు, చేయ‌ని అభ్య‌ర్థులు యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్ http://www.angrau.ac.in/  నుంచి అప్లికేష‌న్ డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూర్తి చేసి కౌన్సిలింగ్‌కు హాజ‌రు కావాల‌ని కోరారు.

యోగి వేమ‌న యూనివ‌ర్శిటీ (వైవీయూ)లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల‌కు స్పాట్ అడ్మిష‌న్లు ఈనెల‌ 21 వ‌ర‌కు జ‌రుగుతాయి. యూనివ‌ర్శిటీలోని 25 కోర్సుల‌కు గాను ఏపీపీజీసెట్‌-2024 అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు వారి ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్లతో యూనివ‌ర్శిటీ క్యాంప‌స్‌లోని అడ్మినిస్ట్రేష‌న్ డిపార్ట్‌మెంట్‌లో హాజ‌రు కావాలి. అడ్మిష‌న్ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో అడ్మిష‌న్లు జ‌రుగుతాయి. విద్యార్థుల‌ స‌ర్టిఫికేట్ల ప‌రిశీల‌న వి.రామ‌కృష్ణ‌, ఎన్‌. గ‌ణేష్ నాయ‌క్‌లు చేస్తారు.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner