YS Sharmila Oath: ముహుర్తం ఖరారు.. 21న పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతల స్వీకరణ
YS Sharmila Oath: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్.షర్మిల ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. షర్మిల రాకతో ఏపీ రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
YS Sharmila Oath: ఏపీలో షర్మిల పొలిటికల్ ఎంట్రీకి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీ ఉదయం 11గంటలకు పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల నియామకాన్ని ఇప్పటికే ఏఐసిసి ప్రకటించగా కుమారుడి వివాహం నేపథ్యంలో 21న ఆమె బాధ్యతలు చేపడతారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ సమక్షంలో షర్మిల బాధ్యతలు చేపడతారు.
ఏపీలో షర్మిల ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవాన్ని కల్పించడమే లక్ష్యంగా షర్మిల నియామకం జరిగింది. షర్మిల నియామకం ద్వారా ఇరుపక్షాలకు ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ-షర్మిల భావిస్తున్నారు.
రెండేళ్ల క్రితం తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును వెదక్కుంటూ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మూడు వేల కిలోమీటర్ల పొడవున పాదయాత్ర చేశారు. షర్మిల రాజకీయాల్లోకి రావడం ఆమె సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని మొదట్లోనే స్పష్టమైంది. ఈ విషయంలో జగన్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా సజ్జల మాత్రం స్పందించారు. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆదిలోనే ప్రకటించారు.
సజ్జల ప్రకటనపై షర్మిల నొచ్చుకున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాదాపు రెండేళ్ల పాటు ఎన్నో కష్టనష్టాలకు ఎదురొడ్డి తెలంగాణలో పార్టీని నడిపించారు. ఈ క్రమంలో ఆమె సొంత ఆస్తుల్ని కూడా అమ్ముకున్నారని ప్రచారం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రను నిర్వహించినపుడు నిత్యం లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చిందని సన్నిహితంగా మెలిగిన వాళ్లు చెప్పేమాట.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్సార్‌టీపీ భావించినా కర‌్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. షర్మిలను పోటీ నుంచి తప్పుకునేలా చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ క్రమంలో షర్మిల కూడా బేషజాలకు పోకుండా తెలంగాణలో వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్నారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు రావాలన్న ఆశయం అంత సులువు కాదని ఆమెకు తొందరగానే అర్థమైంది. తెలంగాణ సామాజిక నేపథ్యం, ఉద్యమ చరిత్ర, ఆంధ్రా-తెలంగాణ వాదనల్లో భిన్నాభిప్రాయాలు, రాజకీయ వైరుధ్యాలతో పాటు షర్మిలకు వెన్నంటి ఉన్న వైఎస్సార్ వారసత్వం కూడా ఆ ప్రాంతంలో ఆమె ఎదుగుదలకు అడ్డంకి అవుతుందని గ్రహించారు.
ఈ క్రమంలో తెలంగాణ కంటే ఏపీలోనే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావించారు. ఏ ఉద్దేశంతో షర్మిల తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారో కానీ చివరకు ఆంధ్రాలోనే ఆమె కార్యక్షేత్రం ఖరారైంది. ఏదో ఒక రోజు ఏపీలో ఎంట్రీ ఇవ్వాల్సి ఉటుందని షర్మిల కూడా ఖచ్చితంగా అంచనా వేసి ఉంటారనే వాదన కూడా కాంగ్రెస్‌లో ఉంది.
తెలంగాణలో ఆదరణ లభించకపోతే ఖచ్చితంగా ఏపీలోనే భవిష్యత్తు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె ఊహించి ఉంటారని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఏపీలో ఒకప్పుడు జగన్ విడిచిన బాణంగా వైసీపీ ప్రచార బాధ్యతలు మోసిన షర్మిల ఇప్పుడు బూమారాంగ్ కానున్నారు. ఇకపై సోదరుడితోనే ప్రత్యక్షంగా తలపడాల్సి ఉంది.
సోదరుడితో యుద్ధం సులువేనా…
ఏపీలో అధికార పక్షంగా ఉన్న వైఎస్సార్సీపీతో కాంగ్రెస్ పార్టీ తలపడాల్సి ఉంటుంది. పిసిసి అధ్యక్షురాలి హోదాలో షర్మిల యుద్ధం అన్నతోనే చేయాల్సి ఉంటుంది. ఆ యుద్ధం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. రాష్ట్ర విభజనకు ముందు, వెనుక జరిగిన పరిణామాల నేపథ్యంలో షర్మిల పోరాటం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీని సమూలంగా తుడిచి పెట్టేశామనే భావనలో ఇన్నాళ్లు వైసీపీ ఉంది. జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ వెన్నంటి నడిచిన వారిలో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది. కాంగ్రెస్ సాంప్రదాయక ఓటు బ్యాంకులో చాలా భాగాన్ని వైసీపీ కొల్లగొట్టింది. ఇప్పుడు దానిలో కొంతైనా సంపాదించుకోవడం షర్మిల కర్తవ్యం కానుంది.
ఏపీలో ప్రతిపక్షాల రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలతో వైసీపీ ఐదేళ్లుగా దూకుడు ప్రదర్శిస్తోంది. కొద్ది నెలల క్రితం పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడంతో ఆ పార్టీని ముప్ప తిప్పలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు 1994నుంచి పన్నుల బకాయిలు చెల్లించాలంటూ వాటిని జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రాష్ట్రంలోని కాకినాడ, విశాఖపట్నం, విజయవాడల్లోని విలువైన భవనాల పన్నులు చెల్లించాలంటూ అధికారులు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌పై ఒత్తిడి చేశారు. దాదాపు రెండు కోట్ల రుపాయల పన్నులు బాకీ ఉన్నాయంటూ స్థానిక అధికారులు కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేసినంత పని చేశారు. ఆ పన్నులు చెల్లించేసరికి కాంగ్రెస్‌కు తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. ముఖ్యమంత్రిని విమర్శించినందుకే ఈ పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.
పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిత్యం తన సోదరుడినే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సి ఉంటుంది. రాజకీయంగా నిప్పులు చెరగాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని ఉదారంగా విడిచిపెడుతుందా, అంది వచ్చిన అవకాశంతో ఉక్కిరి బిక్కిరి చేస్తుందా అనేది చూడాలి.