Central Tax Share: కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా కింద రూ.7,211 కోట్లు...తెలంగాణ‌కు రూ.3,745 కోట్లు విడుద‌ల-rs7211 crore under aps share in central taxes rs 3 745 crore will be released to telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Central Tax Share: కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా కింద రూ.7,211 కోట్లు...తెలంగాణ‌కు రూ.3,745 కోట్లు విడుద‌ల

Central Tax Share: కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా కింద రూ.7,211 కోట్లు...తెలంగాణ‌కు రూ.3,745 కోట్లు విడుద‌ల

HT Telugu Desk HT Telugu
Oct 11, 2024 06:58 AM IST

Central Tax Share: కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 3, 745 కోట్లు కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. అక్టోబర్ నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఏపీ, తెలంగాణలకు పన్నుల వాటా నిధుల విడుదల
ఏపీ, తెలంగాణలకు పన్నుల వాటా నిధుల విడుదల (HT_PRINT)

Central Tax Share: కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 3, 745 కోట్లు కేంద్ర ప్ర‌భుత్వం గురువారం విడుద‌ల చేసింది. అక్టోబర్ నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అందులో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలకు గాను రూ.1,78,173 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

అక్టోబర్ నెల పన్నుల వాటా కింద రాష్ట్రాలకు కేంద్రం రూ.89,087కోట్లు, దసరా, దీపావళి నేపథ్యంలో మూలధన వ్యయాన్ని వేగవంతం చేసే ఉద్దేశంతోనే అడ్వాన్స్ ఇనిస్టాల్మెంట్ కింద రూ.89,086 కోట్లను కలిపి విడుద‌ల చేసినట్లు పేర్కొంది. కాగా పన్నుల వాటాలో ఉత్త‌రప్ర‌దేశ్‌కి అత్యధికంగా రూ. 31,962 కోట్లు విడుద‌ల అయ్యాయి. ఆ త‌రువాత‌ స్థానంలో బీహార్ రూ.17,921కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 13,987 కోట్లు, ప‌శ్చిమ బెంగాల్‌కు రూ. 13,404 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసింది.

అత్యల్పంగా గోవాకు రూ.688 కోట్లు, సిక్కింకు రూ.691 కోట్లు, మిజోరంకు రూ.891 కోట్ల‌ను ప‌న్నుల వాట కింద విడుద‌ల చేసింది. ఈ మూడు రాష్ట్రాల‌కు మాత్ర‌మే రూ.1,000 కోట్ల లోపు విడుద‌ల చేసింది. నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో 14 వాయిదాల్లో కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేయోచ్చని తెలిపింది.

ఇందుకు భిన్నంగా 11 నెలల్లో పదకొండు వాయిదాలతో పాటు మార్చిలో మూడుసార్లు పన్నుల వాటాను విడుదల చేసినట్లు వెల్లడించింది. కాగా పండగల సీజన్‌లో అభివృద్ధి, సంక్షేమ సంబంధిత వ్యయాలకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతోనే తాజాగా అడ్వాన్స్ ఇనిస్టాల్మెంట్‌ను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

పన్ను వాటాను 50 శాతానికి పెంచాలి

అయితే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌తో పాటు పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణకు వచ్చిన 16వ ఫైనాన్స్ కమిషన్‌కు ఈ సమస్యలను ప్రభుత్వం వివరించింది. కేంద్ర పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని ప్రతిపాదన పెట్టింది. అలాగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లోనూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.

వాస్తవానికి 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం, కేంద్ర పన్నుల్లో 41 శాతాన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా 2024 ఫైనాన్షియల్ ఈయర్‌లో 32.5 శాతం కేంద్ర పన్నులను రాష్ట్రాలతో పంచుకోవాలని ఆర్థిక శాఖ అంచనా వేసింది. దీని వల్ల సెస్, సర్ చార్జీల్లో కూడా కేంద్రం నుంచి వాటా భారీగా తగ్గుతోందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner