AP Electricity: ఏపీలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, 245 మిలియన్ యూనిట్లు దాటిన విద్యుత్ డిమాండ్…-rising electricity consumption in ap electricity demand crossing 245 million units ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Electricity: ఏపీలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, 245 మిలియన్ యూనిట్లు దాటిన విద్యుత్ డిమాండ్…

AP Electricity: ఏపీలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, 245 మిలియన్ యూనిట్లు దాటిన విద్యుత్ డిమాండ్…

Sarath chandra.B HT Telugu
Apr 24, 2024 06:25 AM IST

AP Electricity: ఏపీలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోయింది. దీంతో సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సిఎస్‌ అధికారుల్ని ఆదేశించారు.

ఏపీలో పెరిగిన విద్యుత్ డిమాండ్
ఏపీలో పెరిగిన విద్యుత్ డిమాండ్

AP Electricity: ఏపీలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో వేసవి ఎండల Summer Temparatures తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఇంధన శాఖ అధికారులతో సిఎస్‌ సమీక్షించారు. విద్యుత్ డిమాండుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ ఏడాది జూన్ వరకూ ఎదురయ్యే విద్యుత్ డిమాండుకు అనుగుణంగా విద్యుత్ సరఫరాకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తికి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకూ విద్యుత్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.

ఈ ఏడాది జూన్ వరకూ రోజు వారీ విద్యుత్ డిమాండు ఏవిధంగా ఉంటుందనేది అంచనా వేశారు. ఏప్రిల్ నెలలో 245 మిలియన్ యూనిట్లు, మేలో 236 మిలియన్ యూనిట్లు, జూన్ లో 253 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు వివరించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు సరాసరిన 245 నుండి 250 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని వివరించారు. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ను సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం జరుగుతోందని సిఎండి తెలిపారు.

సాధ్యమైనంత వరకూ విద్యుత్ డిమాండుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో రోజువారి బొగ్గు నిల్వలను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు సిఎస్‌కు వివరించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను ఆయా విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని సిఎస్ ఆదేశించారు.

తాగునీటి సరఫరా….

రాష్ట్రంలో తాగునీరు, ఉపాధి హామీ పనులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పరిస్థితులపై సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి పనులు నిర్వహించిన కూలీలకు సకాలంలో కూలి సొమ్ము చెల్లించాలని చెప్పారు.

ప్రకాశం బ్యారేజి నుండి మరియు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో సకాలంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి గల ఆవాసాలు,కాలనీలకు ట్యాంకులు ద్వారా మంచినీటిని సరఫరా చేసే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటి కప్పుడు పరిశీలించి ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సిఎస్ స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం