Sand Price Control: ఏపీలో తగ్గిన ఇసుక ధరలు, మార్కెట్లకి పోటెత్తిన ఇసుక.. విజయవాడలో ట్రాక్టర్‌ రూ.4వేలు-reduced sand prices in ap sand poured into markets tractor in vijayawada rs 4 thousand ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sand Price Control: ఏపీలో తగ్గిన ఇసుక ధరలు, మార్కెట్లకి పోటెత్తిన ఇసుక.. విజయవాడలో ట్రాక్టర్‌ రూ.4వేలు

Sand Price Control: ఏపీలో తగ్గిన ఇసుక ధరలు, మార్కెట్లకి పోటెత్తిన ఇసుక.. విజయవాడలో ట్రాక్టర్‌ రూ.4వేలు

Sand Price Control: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు, మార్కెట్‌ విక్రయాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు కాస్త ఫలిస్తున్నాయి. ఈ ఏడాది కనిష్ట స్థాయికి ఇసుక ధరలు చేరుకున్నాయి. విజయవాడ మార్కెట్‌లో ట్రాక్టర్‌ ధర ఏడాది కనిష్టానికి చేరింది. నగరంలో నిర్మాణాలకు పెద్ద ఎత్తున ఇసుక అందుబాటులోకి వచ్చింది.

విజయవాడ గొల్లపూడి బైపాస్‌లో బారులు తీరిన ఇసుక ట్రాక్టర్లు

Sand Price Control: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విమర్శల పాలైన ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చేపట్టిన దిద్దుబాటు చర్యలు క్రమంగా ఫలిస్తున్నాయి. ఇసుక రీచ్‌ల నుంచి అక్రమ తరలింపు, ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు ఇసుకను తరలించడాన్ని కట్టడి చేయడంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఇసుక లభ్యత గాడిన పడింది. విజయవాడలో ఈ ఏడాది కనిష్ట స్థాయికి ఇసుక ధర చేరింది. నగరంలో ట్రాఫిక్ నిబంధనల కారణంగా పగటి సమయంలో టిప్పర్‌లతో ఇసుకను సరఫరా చేసే అవకాశం లేకపోవడంతో ఇసుక రీచ్‌ల నుంచి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు శివారు ప్రాంతాలకు చేరుతున్నాయి.

ఈ ఏడాది మార్చిలో ఇసుక ధర ఫుల్ లోడ్‌ ట్రాక్టర్‌ నాలుగైదు టన్నుల ధర రూ.4500 ఉండేది. ఆ తర్వాత మే నాటికి అది రూ7వేలకు చేరింది. జూన్‌లో రూ.8-10వేలకు చేరింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించింది. గత ఐదేళ్లలో నిర్మాణ రంగం కుదేలైపోయింది. గత ప్రభుత్వ మైనింగ్ పాలసీ పుణ్యాన ఇసుక బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది. రీచ్‌లన్ని రాజకీయ నాయకుల గుప్పెట్లో చిక్కుకోవడంతో 2019 నుంచి ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. 2019లో జూన్‌లో ఇసుక తవ్వకాలపై నిషేధంతో మొదలైన ఆంక్షలు ఆ తర్వాత రకరకాల మలుపులు తిరిగాయి. దీంతో మొత్తం నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది.

వైసీపీ ప్రభుత్వంపై అసంఘటిత రంగ కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత రావడానికి గతంలో అనుసరించిన ఇసుక విధానమే కారణమైంది. నిర్మాణాలు నిలిచిపోవడంతో కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చింద. జూన్‌లో ప్రభుత్వం మారే సమయానికి ఇసుక స్టాక్‌ పాయింట్లలో 44 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన హడావుడిలో స్థానిక నేతలు ఎక్కడికక్కడ ఇసుక నిల్వల్ని మాయం చేసేశారు. దీంతో ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రయోజనాలు ఎవరికి అందడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి.

కూటమి ప్రభుత్వం వచ్చిన నాాలుగైదు నెలల్లో ఇసుక కొరత కొనసాగింది. దీంతో కొద్ది రోజుల క్రితం ఇసుక విక్రయాల్లో నేతలు ఎవరు జోక్యం చేసుకోవద్దని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. మరోవైపు వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో డిమాండ్ కు తగిన స్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇసుక సరఫరా కోసం 108 కొత్త ఇసుక రీచ్‌లు అందుబాటులో వస్తాయని ప్రకటించారు. మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఇసుక అక్రమ నిల్వలు, తరలింపుపై పోలీసులు చర్యలు ప్రారంభించడంతో ధరలు కూడా తగ్గు ముఖం పట్టాయి. ఇసుక విధానంలో ఇప్పటికి కొన్ని లోపాలు, సమస్యలు ఉన్నాయి. దీంతో ట్రాక్టర్ యజమానులు ఇసుకను నగరాలకు తీసుకుని వచ్చి విక్రయించేందుకు అయ్యే ఖర్చును కొనుగోలుదారుడిపై వేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.4వేలుగా ఉంది.

ఇసుక కొనుగోలును సులభతరం చేయడానికి ఆన్ లైన్ పోర్టల్ తో పాటు రీచ్‌ల వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. చెకింగ్, GPS ట్రాకింగ్, ఆడిట్ ల ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌ జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇసుక అమ్మకం ధర, రీచ్‌ నుంచి దూరాన్ని బట్టి ఎంతకు విక్రయించవచ్చనే విషయంలో స్పష్టత లేకపోవడంతో నిర్మాణాలపై ఇంకా భారం పడుతోంది. గతంతో పోలిస్తే ధర తగ్గినా మరింత తగ్గాల్సి ఉందని నిర్మాణదారులు చెబుతున్నారు.