Mla Rapaka : అత్యుత్సాహంతో నోరు జారిన రాపాక, దొంగ ఓట్ల వ్యాఖ్యలపై నివేదిక కోరిన సీఈవో
Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని ఎమ్మెల్యే రాపాకకు ఇటీవల నోరు జారారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఓ వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యాఖ్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం కలెక్టర్ ను ఆదేశించింది.
Mla Rapaka : రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తన విజయానికి దొంగ ఓట్లే కారణమని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తూచ్ నేను అలా అనలేదని కవర్ చేసుకున్నారు. అయితే ఓ రెండ్రోజులు రాపాక కామెంట్స్ వైరల్ అయ్యాయి. జనసేన టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్... వైసీపీకి జంప్ అయ్యారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా... ఆ పార్టీ నేతగానే వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన తన విజయానికి దొంగ ఓట్లు కారణమని అనేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంకటపతిరాజు అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఈ వీడియోపై సమగ్ర నివేదిక ఇవ్వాలని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించారు.
దొంగ ఓట్లతో మెజారిటీ
గత ఎన్నికల్లో తన విజయానికి దొంగ ఓట్లు కూడా కారణమని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమ స్వగ్రామం చింతలమోరికి 15 నుంచి 20 మంది దొంగ ఓట్ల బ్యాచ్ వచ్చేదని, ఒక్కొక్కరు 5 నుంచి 10 ఓట్లు వేసేవారని, తన విజయంలో దొంగ ఓట్ల పాత్ర కూడా ఉందన్నారు. దీంతో తనకు 800 ఓట్ల పైనే మెజారిటీ వచ్చిందని వివరించారు. అత్యుత్సాహంతో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాపాక మెడకు చుట్టుకున్నాయి. దొంగ ఓట్లతో గెలిచానని బహిరంగంగా చెప్పిన వీడియోపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఈ అంశంపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోనసీమ కలెక్టర్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ముందు నోరు జారి ఆ తర్వాత కవరింగ్
దొంగ ఓట్లతో గెలిచానని ముందు నోరు జారిన రాపాక... ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ఓ కార్యక్రమంలో చెప్పితే దాన్ని వక్రీకరించారని తెలిపారు. చింతలపల్లిలో ఆత్మీయ సమావేశం పెట్టడం వెనుక కారణం.. బంతు రాజేశ్వరరావు జనసేనకు వెళ్లడం వల్ల అక్కడి వారంతా తన వెంట ఉంటామని చెప్పడం కోసమే అన్నారు. ఆ సభలో నవ్వుకోవడానికే తాను దొంగ ఓట్లతో నెగ్గానని చెప్పానని, తన ఉద్దేశం అదికాదన్నారు. తాను సమావేశంలో పాల్గొన్న ప్రాంతంలోని ఎస్సీలు 2019లో తన కోసం పని చేయలేదని, జనసైనికులు పనిచేసి గెలిపించారని తెలిపారు. 2019 ఎన్నికల్లో తాను గెలిచింది జనసైనికుల ఓట్ల వల్లే అన్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.