Wildlife Smuggling : విజయవాడ కేంద్రంగా సరికొత్త దందా - 'సీ ఫ్యాన్స్' ఫొటో ఫ్రేమ్స్ తో జనాలకు ఎర, వెలుగులోకి అసలు విషయాలు-rare sea fans worth of 91 lakh seized from trader in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Wildlife Smuggling : విజయవాడ కేంద్రంగా సరికొత్త దందా - 'సీ ఫ్యాన్స్' ఫొటో ఫ్రేమ్స్ తో జనాలకు ఎర, వెలుగులోకి అసలు విషయాలు

Wildlife Smuggling : విజయవాడ కేంద్రంగా సరికొత్త దందా - 'సీ ఫ్యాన్స్' ఫొటో ఫ్రేమ్స్ తో జనాలకు ఎర, వెలుగులోకి అసలు విషయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 23, 2024 09:25 PM IST

Wildlife Smuggling in Vijayawada : విజయవాడలో కొత్తరకం దందా బయటపడింది. సముద్ర గర్భంలో ఉండే ‘సీ ఫ్యాన్స్‌’ తో కూడిన ఫొటో ఫ్రేమ్ లను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటి ఆధారంగా లక్షల రూపాయలు సంపాందిస్తున్నారు. అటవీశాఖ అధికారుల దృష్టికి చేరటంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

వన్యప్రాణుల స్మగ్లింగ్‌
వన్యప్రాణుల స్మగ్లింగ్‌

Wildlife Smuggling in Vijayawada : విజయవాడ కేంద్రంగా సాగుతున్న సరికొత్త దందా బట్టబయలైంది. వన్యప్రాణుల స్మగ్లింగ్‌ కు పాల్పడుతూ లక్షల రూపాయలను దండుకుంటున్న ఓ వ్యక్తి వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ లో యాడ్స్ ఇస్తూ వ్యాపారం చేస్తున్నట్లు … కొందరు గుర్తించారు. సమాచారం అధికారులకు చేరవేయటంతో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. సముద్రగర్భంలో ఉండే జీవులను సేకరిస్తూ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎన్టీఆర్ జిల్లా ఫారెస్ట్ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. వారి వివరాల ప్రకారం…. విజయవాడ కేంద్రంగా వన్యప్రాణుల స్మగ్లింగ్ రాకెట్ నడుస్తున్నట్లు వైల్డ్‌లైఫ్‌ జస్టిస్‌ కమిషన్‌ ఇండియా నుంచి ఫిర్యాదు అందింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ జరపగా… 'సీ ఫ్యాన్స్'(సముద్రగర్భంలో ఉండే ప్రాణి)తో పాటు వన్యప్రాణుల శరీర భాగాలను ఫొటో ఫ్రేమ్ లుగా తయారీ చేసి విక్రయిస్తున్నట్లు తేలింది.

వైల్డ్‌లైఫ్‌ జస్టిస్‌ కమిషన్‌ ఇండియా బృందంతో పాటు ఎన్టీఆర్ జిల్లా అటవీశాఖ అధికారులు కలిసి విజయవాడలోని అయ్యప్పనగర్ లో ఉన్న అక్షయనిధి మార్ట్ లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ సీఫ్యాన్స్ తో పాటు పలు రకాల వన్యప్రాణుల శరరీ భాగాలు ఉన్నాయి. వీటిని ఎండబెట్టిన తర్వాత ఫొటో ఫ్రేమ్ లుగా చేసి విక్రయిస్తున్నారు. వీటిని ఇంట్లో ఉంచుకుంటే అధిక ధనంతో పాటు సిరి సంపదలు వస్తాయని ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ లో యాడ్స్ ఇస్తున్నాడు. ఇదంతా కూడా ఎస్. శ్రీనివాసరావు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు.

లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్న శ్రీనివాస్ రావును  అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.91.25 లక్షల విలువైన వన్యప్రాణి సంపదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి విజయవాడలోని కోర్టులో(జూన్ 22) ప్రవేశపెట్టి రిమాండ్ చేశారు.

విజయవాడకు చెందిన శ్రీనివాసరావు మహారాష్ట్రలోని ఓ విద్యుత్‌ ప్లాంట్‌లో కొంత కాలం పని చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం అయ్యప్పనగర్‌లో అక్షయనిధి పేరుతో ఓ షాపును నిర్వహిస్తున్నాడు. ఇందులో నక్క తోక, ఏనుగు తోక వెంట్రుకలతో తయారు చేసిన బ్రాస్‌ లెట్లు, సముద్రపు తేలు, సముద్రగర్భంలో పెరిగే సీ ఫ్యాన్స్‌ను షెల్స్ తో పలు రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నాడు. సీ ఫ్యాన్స్‌ ఎండిపోయిన తర్వాత…. ఫొటో ఫ్రేమ్‌లో అమర్చి అమ్ముతున్నాడు. ఒక్కో ఫ్రేమ్‌ను రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు విక్ర యుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని 39, 40, 43, 44, 55 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సీ ఫ్యాన్స్‌ అంటే ఏంటి…?

సీ ఫ్యాన్స్(sea fan) అనేవి సముద్రగర్భంలో జీవిస్తాయి. అడుగుభాగాన అత్యంత పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగే ప్రాణులు ఇవి. అంతరిస్తున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్నాయి. సముద్ర మట్టా నికి 20 నుంచి 30 మీటర్ల లోతులో ఉంటాయి. పొడవుగా ఉండే సన్నని మొక్కల మాదిరిగా కనిపిస్తాయి. వన్యప్రాణి చట్టం - 1972 ప్రకారం వీటిని స్మగ్లింగ్ చేయటం నేరం. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఈ వన్యప్రాణులు ఎక్కువగా బెర్ముడా, విండీస్, ఫ్లోరిడా వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి.

 

Whats_app_banner