Chandrababu Arrest : చంద్రబాబును జైలులోనే చంపేందుకు కుట్ర, ఆ రిమాండ్ ఖైదీ తరహాలోనే - లోకేశ్
Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబును జైలులోనే చంపేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని నారా లోకేశ్ ఆరోపించారు. దోమలు కుడుతున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు.
Chandrababu Arrest : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు హౌస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా చంద్రబాబును చంపేందుకు కుట్ర చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
లోకేశ్ ట్వీట్
"జగన్ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించింది. ఆయనను జైలులోనే అంతం చేసేందుకే అరెస్ట్ చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకు జైల్ లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది. చంద్రబాబుకు జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. చంద్రబాబును ఇలాగే చేయాలని సీఎం జగన్ కుతంత్రాలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యత"- లోకేశ్
చంద్రబాబు కస్టడీపై రేపు తీర్పు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ముగిసింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం…రేపు ఉదయం 11.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని తెలిపింది. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా… చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును కస్టడీకి అప్పగించాలంటూ దాఖలు చేసిన పీటీ వారెంట్ల విచారణ ముఖ్యం కాదన్న ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. మొదట కస్టడీ పిటిషన్లపై విచారిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. అన్ని పిటిషన్లు ఒకేసారి విచారించాలని తనపై ఒత్తిడి చేయొద్దని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును 5 రోజుల పాటు విచారించాలని సీఐడీ భావిస్తోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిన్నటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా కస్టడీ పిటిషన్లను విచారించాలని సీఐడీ ఏసీబీ కోర్టును కోరింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది.