Quarry Blast: ఎన్టీఆర్ జిల్లాలో క్వారీ ప్రమాదం, రాళ్లు జారిపడి ముగ్గురు కార్మికుల దుర్మరణం
Quarry Blast: కొండ చరియలు జారిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.
Quarry Blast: కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. బండరాళ్లు జారి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న క్వార్ట్జ్ రాతి క్వారీల్లో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం డ్రిల్లింగ్ పనులు చేపట్టిన సమయంలో ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.
క్వారీపై నుంచి లూజు బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ వేస్తున్న కార్మికులపై పడటంతో రాళ్ల కింద కార్మికులు చిక్కుకుపోయారు. పెద్ద పెద్ద రాళ్ల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయారు. ప్రమాదం తర్వాత ముగ్గురు కార్మికులు అచూకీ లేకపోవడంతో సహచర కార్మికులు గాలింపు చేపట్టారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున క్వార్ట్జ్ మైనింగ్ జరుగుతోంది జిల్లాలో పెద్ద ఎత్తున విస్తరించిన తూర్పుకనుమల పర్వత శ్రేణుల్లో అనధికారికంగా మైనింగ్ జరుగుతోంది. ఇబ్రహీంపట్నం నుంచి కంచికచర్ల వరకు అటవీ ప్రాంతాల్లో సైతం మైనింగ్ జరుగుతోంది. క్వారీల్లో తమిళనాడుతో పాటు స్థానిక గ్రామాలకు చెందిన వారు ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేస్తున్నారు. బ్లాస్టింగ్ కోసం ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండానే జిలెటిన్ అమరుస్తుంటారు.
బ్లాస్టింగ్‌లతో చుట్టుపక్కల నివాసాలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నా వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.