Punganur Incident : ఇది పెద్దిరెడ్డి అడ్డా, టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించిన వైసీపీ నేత
Punganur Incident : చంద్రబాబుకు మద్దతుగా సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పుంగనూరులో వైసీపీ నేత అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు తొలగించి, దుర్భాషలాడారు.
Punganur Incident : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టుతో టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. చంద్రబాబుకు మద్దతుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ధర్నాలు, నిరసనలను పోలీసులు, వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సైకిల్ పై యాత్రగా కుప్పం వరకూ వెళ్తున్నారు. వీరికి మార్గమధ్యలో చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ మద్దతుదారుడు, మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి దుర్భాషలాడారు. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించిన వైసీపీ నేత
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు పలువురు టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేపట్టారు. వీరి సైకిల్ యాత్ర మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చేరుకుంది. సైకిల్ కు టీడీపీ జెండాలు పెట్టుకుని, చంద్రబాబు బొమ్మలున్న ఎల్లో టీషర్టులను ధరించి టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఓ టీషాపు వద్ద ఆగిన టీడీపీ కార్యకర్తలను అటుగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి చూసి వారిని అడ్డుకున్నాడు. టీడీపీ కార్యకర్తలను దూషిస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ... వారి ధరించిన పసుపు చొక్కాలు విప్పించాడు. టీడీపీ జెండాలు, చొక్కాలు తీస్తేనే పుంగనూరు నియోజకవర్గం నుంచి కదలనిస్తామని ఆ వ్యక్తి బెదిరించాడు. ఇది పెద్దిరెడ్డి నియోజకవర్గమంటూ టీడీపీ జెండాలను నెలపై పడేసి తొక్కాడు. ఈ వ్యవహారాన్ని వీడియో తీయమని చెప్పిన వైసీపీ కార్యకర్త, తన పేరు చెంగలాపురం సూరిగా అని చెప్పారు.
ప్రజలు అధికారం ఇచ్చింది చొక్కాలు విప్పించడానికేనా - లోకేశ్
ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనలో సైకిల్ తొక్కినా నేరమే! పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని నారా లోకేశ్ మండిపడ్డారు. ఎక్స్ లో ట్వీట్ చేస్తూ... అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డారని తెలిపారు. చంద్రబాబుతో నేను అంటూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి అనుచరుడు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించడానికి, జెండాలు పీకడానికా జగన్? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ఘటనపై నారా భువనేశ్వరి కూడా స్పందించారు. పుంగనూరు ఘటన వైసీపీ పెత్తందారీ పోకడలకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి ఉదాహరణ అన్నారు. బీహార్ లో కూడా ఇలాంటి అరాచక పరిస్థితులు లేవన్నారు. టీడీపీ కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు.