AP Property Tax: ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్నులో ఏటా 15 శాతం పెంచేలా జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం నిలిపి వేసి, ఆస్తి పన్ను సవరణ చట్టం 44/2020 ని రద్దు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అద్దెవిలువ మీద ఆస్తిపన్ను లెక్కించే విధానాన్ని రద్దుచేసి, ఆస్తి కేపిటల్ విలువ మీద ఆస్తి పన్ను లెక్కించే విధానాన్ని 2020లో ప్రవేశ పెట్టింది. దీని కోసం మున్సిపల్ చట్టాలకు సవరణ చేస్తూ సవరణ చట్టం 44/2020 ని తెచ్చింది.
ఏపీలో ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ మారినప్పుడల్లా ఆస్తి పన్ను కూడా మారే విధంగా సవరణ చట్టంలో నిబంధన విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసినా అప్పట్లో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో ఏటా 15శాతం చొప్పున పన్నులు పెరుగుతూనే ఉన్నాయి.
ఏటా పెరిగే పన్నులతో ప్రజలపై భారం పడుతుండటంతో ఆస్తిపన్ను సవరణ చట్టాన్ని 2020 చేసినపుడే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గత ప్రభుత్వం ఈ ఆంధోళనలు పట్టించుకోలేదు. ఈ చట్టం అమలు చేయటం కోసం రూల్సును రూపొందిస్తూ 2020నవంబర్ 24న జీవో నెంబరు 198 ని తీసుకు వచ్చారు.
ఈ జీవో ప్రకారం ఆస్తి పన్నును ఏటా 15 శాతం కాంపౌండింగ్ రూపంలో పెంచుతున్నారు. జీవో 198 ప్రకారం గత నాలుగేళ్లలో 75 శాతం ఇళ్ళ పన్నులు పెరిగాయి.
చివరకు ఆస్తిని తండ్రి, కొడుకు పేర గిఫ్ట్ గా రాసినా, గిఫ్ట్ గా రాసిన తేదీన ఉన్న కేపిటల్ విలువ ప్రకారం ఇంటిపన్ను విధిస్తున్నారు. కేవలం రికార్డులలో పేరు మారినందుకు పన్ను పెరుగుతోంది.
అప్పు చేయటం కోసం అనుమతి ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులకు అనుగుణంగా ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏటా పెంచుతున్న 15 శాతం ఆస్తి పన్ను పెంపుదలను ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం నిలిపి వేయవలసిందిగా టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆస్తి కేపిటల్ విలువ మీద ఆస్తి పన్నును లెక్కించే విధానం కొరకు చేసిన ఆస్తిపన్ను సవరణ చట్టం 44/2020 ను రద్దు చేసి, అద్దె విలువ ఆధారంగా ఇంటిపన్నును లెక్కించే పాతపధ్ధతిని పునరుధ్దరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.