President Murmu Srisailam Visit: ఈనెల 26న శ్రీశైలానికి రాష్ట్రపతి
President Murmu Srisailam Tour: ఈ నెల 26న దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
President Murmu Visit Srisailam: దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైలం రానున్నారు. ఈ మేరకు ఆమె టూర్ ఖరారైంది. దీంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటను విజయవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు అధికారులతో కలిసి నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్, ఎస్పీ రఘువీర్‌రెడ్డి పరిశీలించారు. సున్నిపెంటలోని హెలిప్యాడ్‌ను, సాక్షిగణపతి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు.
నందిసర్కిల్‌లోని సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ వద్ద కేంద్రప్రభుత్వ పథకాల శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సున్నిపెంటలోని హెలిప్యాడ్ వద్ద ఒకేసారి మూడు హెలికాప్టర్లు సిద్ధం అయ్యేలా సిద్ధం చేసి.. ట్రయల్ నిర్వహిచే పనిలో పడ్డారు అధికారులు. ఆలయ ప్రధాన గోపురం నుంచి సాంప్రదాయం ప్రకారం.. రాష్ట్రపతి పూర్ణకుంభంతో స్వాగతం పలకనున్నారు.
ముమ్మర ఏర్పాట్లు..
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులకు ఏర్పాట్లుకు సంబంధించి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటించే ప్రతి ప్రదేశం వద్ద కూడా ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య టీం, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే రోజు రాష్ట్రపతి పర్యటనపై రిహార్సల్స్ నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన నిమిత్తం భారీ బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు ఎస్పీలతో పాటు డీఎస్పీలు, సీఐలు, స్పెషల్ పార్టీ, బాంబ్‌స్క్వాడ్ తదితర 1,800 మందికి పైగా పోలీస్ సిబ్బందిని శ్రీశైలానికి డిప్యుటేషన్ విధుల్లో నియమించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
శ్రీశైలం పర్యటన ముగిసిన తర్వాత అక్కడ్నుంచి... తెలంగాణ పర్యటనకు బయలుదేరనున్నారు రాష్ట్రపతి. అదే రోజు మధ్యాహ్నం 3.05 గంటల నుంచి 3.15 వరకు బొల్లారంలో యుద్ధస్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించడంతో పాటు వీరనారులను సన్మానించనున్నారు. సాయంత్రం 7.45 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇచ్చే విందుకు హాజరవుతారు.
ఈనెల 27న ఉదయం 10.30 గంటలకు నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీని సందర్శించి విద్యార్థులతో సంభాషించనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4గంటల వరకు సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీసు అకాడమీని సందర్శించి శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులతో మాట్లాడనున్నారు. ఇక ఈ నెల 28న ఉదయం 10.40 నుంచి 11.10 గంటల వరకు భద్రాచలం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ‘ప్రశాద్’ అనే ప్రాజెక్టును ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడ సైతం ప్రశాద్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖకి సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
ఇక 29న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు షేక్‌పేట్‌లోని నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ను రాష్ట్రపతి సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి ఉంటుంది. సాయంత్రం 5–6 గంటల వరకు శంషాబాద్‌లోని శ్రీరామా నుజాచార్యుల విగ్రహాన్ని సందర్శిస్తారు. 30న ఉదయం 10–11 గంటల వరకు రంగారెడ్డి జిల్లా శాంతివనంలోని శ్రీరామచంద్ర మిషన్‌ను సందర్శించి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏపీ, తెలంగాణకు చెందిన అంగన్‌వాడీ, ఆశ వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘హర్ దిల్ ధ్యాన్..హర్ దిన్ ధ్యాన్’ అనే నినాదాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీరామచంద్ర మహారాజ్ 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రపతి నిలయం చేరుకొని ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.