Tirumala Rush : తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ-piligrim rush continues in tirumala with public holidays ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Rush : తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

Tirumala Rush : తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

HT Telugu Desk HT Telugu
Aug 15, 2022 07:17 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు పోటెత్తారు. టీటీడీ అధికారులు కూడా భక్తుల తాకిడిని ఊహించలేకనంతగా రద్దీ పెరగడంతో భక్తులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

<p>తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ</p>
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. రెండో శనివారంతో పాటు ఆది, సోమ వారాల్లో సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. భక్తుల రద్దీకి తగినట్లుగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినా వారి సంఖ్యను ఊహించలేనంతగా పెరగడంతో క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం ఉదయానికి కూడా ఔటర్ రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్లలో భక్తులు కొనసాగారు. వరుస పండుగ సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి రావడంతో భక్తులు అలసిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులకు ఇక్కట్లు తప్పడం లేదు. మంచినీరు తగినంత అందుబాటులో లేదనే విమర్శలు వినిపించాయి.

టీటీడీ జెఈవో వీరబ్రహ్మం నారాయణ గిరి, ఓఆర్‌ఆర్‌, వైకుంఠం కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్ల వద్ద క్యూ లైన్లలో టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు 50 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 1.30 లక్షల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఉప్మా, పొంగల్ అందించారు. సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు సంఖ్యలో అన్న ప్రసాదాలు అందించారు. క్యూలైన్లలో ఉన్న పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.

క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. గంటకు 5వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసి సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు.

తిరుమల ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి..

భక్తుల అధిక రద్దీ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు తమ యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. చిన్నపిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులకు టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేసినా వేలాది మంది భక్తులు దర్శనానికి వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల భక్తులతో పాటు జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వచ్చిన యాత్రికులు, కొత్తగా పెళ్లయిన జంటలు కూడా పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలిరావడంతో రద్దీ ఏర్పడింది.

ఇంజినీరింగ్‌, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నా భక్తుల సంఖ్యకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడం కష్టంగా మారింది.

Whats_app_banner