Pawan Kalyan PC : మంత్రి వర్గంలో అధికార వికేంద్రీకరణ ఎందుకు లేదన్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan PC రాష్ట్రంలో అధికారం మొత్తం ఒక్క వ్యక్తి దగ్గరే ఉందని, ఒక్క వ్యక్తి, ఒక కుటుంబం చేతిలో పాలన సాగుతుందోని, అలాంటి ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతోందని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. విశాఖ పర్యటనలో జనవాణి కార్యక్రమం కోసమే వచ్చామని, మూడు రాజధానుల విషయంలో జనసేన వైఖరి ఎప్పుడో స్పష్టం చేశామని పవన్ చెప్పారు. అమరావతి రాజధాని అని తమ పార్టీ ఎప్పుడో నిర్ణయించిందని అందులో మరో ఆలోచన లేదని పవన్ స్పష్టం చేశారు. విశాఖ పర్యటన మూడ్నెల్ల క్రితమే ఖరారైందని, వైసీపీ కంటే ముందే తమ షెడ్యూల్ ఖరారైందని చెప్పారు.
Pawan Kalyan PC ఉత్తరాంధ్ర పర్యటన మూడు నెలల క్రితం ఖరారైందని, వైసీపీ నాయకుల మూడు రాజధానుల కార్యక్రమానికి మూడ్రోజుల ముందే ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకున్నట్లు పవన్ చెప్పారు. వైసీపీ గర్జన కార్యక్రమాన్ని భగ్నం చేయాలని , నిర్వీర్యం చేయాలనే ఆలోచన లేదు.తమ పార్టీ ప్రోగ్రామ్ ఎలా నడపాలో నిర్ణయించడానికి మీరెవరని వైసీపీని ప్రశ్నించారు.
జనవాణి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సమస్యలు తెలుసుకుని బాధితులకు చేయూతనివ్వడమని పవన్ చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేసిన తమ కార్యకర్తల్ని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ వారికి కోనసీమ వంటి గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులతో తమకు ఎలాంటి పేచీ లేదని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు శాశ్వతం కాదనే సంగతి పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు.
ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే జనం గొంతును నొక్కేందుకు వైపీపీ వారు ప్రయత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోను తమకు ఇబ్బంది రాలేదని, ముందస్తు అనుమతులు తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.జనవాణి కార్యక్రమంలో వ్యక్తిగత విమర్శలు లేకుండా పాలసీ ప్రకారమే వ్యవహరిస్తున్నామని చెప్పారు.
31 ఎంపీలు, 151మంది ఎమ్మెల్యేలున్న చోట బూతు పంచాంగం తప్ప సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేకపోవడంతోనే ప్రజలు తమ వద్దకు పరిష్కారం కోసం వస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రాంతీయ సమస్యలు, కాలుష్య సమస్యలు, ప్రజలు, వికలాంగులకు సంబంధించిన 3వేల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని పరిష్కరించడం కోసమే విశాఖలో కూడా జనవాణి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.
మూడు రాజధానులు, వికేంద్రీకరణ గురించి ఇప్పటికే ప్రకటించామన్నారు. పోలీస్ కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చిన తనకు పోలీస్ శాఖ మీద గౌరవం ఉందన్నారు. పోలీసులు ప్రభుత్వ నిర్ణయాలను మాత్రమే అమలు చేస్తారని, విమానాశ్రయం నుంచి వచ్చేపుడు ఐపీఎస్ స్థాయి ఉన్నతాధికారి అటంకాలు కల్పించారని ఆరోపించారు. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరించారని, వివేకానంద రెడ్డి హత్య మీద ఎందుకు అలా వ్యవహరించలేకపోయారని ప్రశ్నించారు. జనసేన నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. వారిని బేషరతుగా విడుదల చేసే వరకు జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
పోలీస్ శాఖకు గౌరవం ఇవ్వలేకపోయిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని పవన్ ఆరోపించారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు మీద తనకు నమ్మకం లేదన్న మనిషి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు.
అర్థరాత్రి జనసేన నాయకుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రతి గదిలో తిరిగి వందలాది మందిని అరెస్ట్ చేశారని, హోటల్లో అలజడి సృష్టించారని ఆరోపించారు. గంజాయి సాగు చేసే వారిని వదిలేసి, వారికి మద్దతిచ్చే రాజకీయ నాయకుల్ని వదిలేసి సామాన్యుల గొంతు వినిపించడానికి వచ్చిన జనసేనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దోపిడి చేసేవారికి, నేరస్తులకు మద్దతిచ్చి జనసేనకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు.
అధికార వికేంద్రీకరణ గురించి తమ పర్యటనలో ఎలాంటి ప్రస్తావన లేదని, అమరావతి రాజధానిగా ఉండాలని మాత్రమే తాము నిర్ణయం తీసుకున్నామని, 2014లో విశాఖపట్నం అని ఖరారు చేసి ఉంటే దానికే తాను కట్టుబడి ఉన్నానని, రాజు వచ్చినపుడల్లా రాజధాని మారుస్తానంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే,అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు చేపట్టరని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో సాగు నీటి ప్రాజెక్టులు ఎందుకు చేపట్టలేదన్నారు.
వైసీపీ చెప్పే రాజకీయ వికేంద్రీకరణ 48 శాఖలు, 26 మంది మంత్రులు, ఐదుగురు డిప్యూటీ సిఎంలకు అధికార వికేంద్రీకరణ ఎందుకు పంపిణీ చేయలేదన్నారు. వైసీపీలో ఏ స్థాయి నాయకుడైనా చిలక పలుకులు ఎందుకు మాట్లాడుతున్నారని, బూతులు మాట్లాడి పోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న నాయకులంతా ఒకే వ్యక్తి గొంతును ఎందుకు వినిపిస్తున్నారని ప్రశ్నించారు. నిజమైన అధికారం ఒకరి గుప్పెట్లోనే ఉందని, ఎస్సీ, ఎస్టీ, బ్రహ్మణ,, కాపు, 56 బీసీ కార్పొరేషన్లు, మైనార్టీ కార్పొరేషన్లకు నిధులివ్వలేదని, ఆ నిర‌్ణయం ఎవరిదని ప్రశ్నించారు. నిధులు, అధికారాలు ఇవ్వని వ్యక్తి అధికార వికేంద్రీకరణ గురించి చెబుతున్నారని ఎద్దేవా చేశారు.పంచాయితీలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ గురించి చెబుతోందన్నారు.
30లక్షల భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన రూ.450కోట్ల నిధుల్ని మళ్లించాలని ఒక్క వ్యక్తే నిర్ణయించారని, శాండ్ మైనింగ్ హక్కులు ఎవరికి ఉండాలో ఒక్కరే నిర్ణయించారని, అధికారం విషయంలో వికేంద్రీకరణ లేదని, విమర్శలు బూతుల విమర్శలు మాత్రమే వికేంద్రీకరణ జరిగాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
పోలీసులు తనను రెచ్చగొట్టి గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తమ పోరాటం ప్రభుత్వంతో అని పోలీసులతో తమకు ఎలాంటి ఘర్షణ లేదని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ బెదిరింపులకు తాను భయపడేది లేదని ప్రకటించారు. క్రిమినల్ పాలిటిక్స్‌కు తాను వ్యతిరేకమని, స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి వచ్చానని, పోలీసుల బెదిరింపులకు భయపడి కార్యక్రమాలను రద్దు చేసుకునే ప్రసక్తి లేదని ప్రకటించారు. వందలాది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని, తమ కెమెరాలు లాక్కున్నారని ఆరోపించారు. అన్నింటికి సిద్దపడి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు. క్రిమినల్స్‌ను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు.
విశాఖ విమానాశ్రయంలో మంత్రుల మీద దాడి యత్నం కూడా పథకం ప్రకాారం జరిగి ఉండొచ్చన్నారు. అంతమంది మంత్రులు వస్తున్నప్పుడు విమానాశ్రయంలో భద్రత ఎందుకు కట్టుదిట్టం చేయలేదని ప్రశ్నించారు. కోడి కత్తి కేసు మాదిరే విశాఖ విమానాశ్రయం దాడి ఘటన కూడా జరిగి ఉండొచ్చన్నారు.