PawanKalyan : నేడు ఉమ్మడి ప్రకాశంలో పవన్ కళ్యాణ్ రైతుభరోసా యాత్ర
ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల్ని పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ‌్ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగనుంది. సాగు భారమై బలవన్మరణానికి పాల్పడిన 80 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందచేస్తారు.
పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగనుంది. గుంటూరు జిల్లా మీదుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించే ఈ యాత్రలో ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ‌్ ఏటుకూరు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.30కు చిలకలూరిపేట వస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజుపాలెం కూడలికి చేరుతారు. అక్కడి నుంచి దేగర్లమూడి, చింతపల్లిపాడు, యనమదల, యద్దనపూడి, పెద్ద జాగర్లమూడి మీదుగా పర్చూరు చేరుకుంటారు.
ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నాం 3 గంటలకు పర్చూరులోని ఎస్. కె. పి. ఆర్. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగే రచ్చబండ సభా వేదికగా రైతు కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అనంతరం రచ్చబండ వేదికగా జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.
రైతు భరోసా యాత్రకు ప్రభుత్వ అడ్డంకులు..
ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే సొంత డబ్బుతో రైతులకు సాయం చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మనస్ఫూర్తిగా అభినందించాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించకపోగా అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారని, మంచి పనికి ముందుకు వస్తే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కడప జిల్లాలో జనసేన సభకు వెళ్లవద్దంటూ నోటీసులిచ్చారనీ, జనసేన పార్టీ తర్వాతి కౌలు రైతు భరోసా యాత్ర కడప జిల్లాలోనే చేపడతామని, ఎలా అడ్డుకుంటారో చూస్తామన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం ఏ విధంగానూ రైతులకు భరోసా కల్పించడం లేదని కొత్తకౌలు రైతు చట్టం తీసుకువచ్చి రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రూ.7 లక్షల పరిహారం ఇస్తామని గొప్పలు చెప్పి కేవలం 24 శాతం రైతులకే ప్రభుత్వం నుంచి సహాయం చేశారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ ప్రతి జిల్లాలో పర్యటించి రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపుతుంటే ముఖ్యమంత్రికి ఎందుకంత భయమన్నారు. కడప జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన 132 మంది కౌలు రైతులు కుటుంబాలను ఆదుకుంటామని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆత్మహత్యకు పాల్పడిన 13 మంది కౌలు రైతులకు సహాయం చేస్తామని ప్రకటించారు. రైతులకు అండగా నిలబడే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని ప్రకటించారు.
టాపిక్