Murder For Match Box : అగ్గిపెట్టె కోసం వృద్ధుడి హత్య
Murder For Match Box తిరుపతిలో హత్యకు గురైన విజయవాడకు చెందిన వృద్ధుడి హత్య మిస్టరీ వీడింది. అగ్గిపెట్టె కోసం జరిగిన ఘర్షణలో రాయితొ వృద్ధుడిని హతమార్చినట్లు గుర్తించారు. హత్య తర్వాత ఘటనా స్థలం నుంచి నిందితుడు పరారైనా సీసీ కెమెరాల సాయంతో పోలీసులు హంతకుడిని గుర్తించారు.
Murder For Match Box తిరుపతిలో హత్యకు గురైన విజయవాడ అరండల్ పేటకు చెందిన వృద్ధుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బీడీ వెలిగించు కునేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదనే కోపంతో వృద్ధుడ్ని ఓ వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఎస్వీయూ పోలీస్‌స్టేషన్‌లో హత్య వివరాలను తిరుపతి పడమర డీఎస్పీ నరసప్ప వెల్లడించారు. నవంబర్ 15రాత్రి మహిళా వర్సిటీ బస్‌షెల్టర్‌లో గుర్తుతెలియని వృద్ధుడు హత్యకు గురయ్యాడు. మృతుడి వద్ద లభించిన ఆధారాల ప్రకారం విజయవాడకు చెందిన రేపాకుల లక్ష్మణరావుగా గుర్తించారు. భార్య పిల్లలను వదిలేసి తిరుపతిలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు గుర్తించారు. అప్పుడప్పుడు సొంత ఊరికి వెళ్లి వస్తుండేవాడు.
రాత్రి సమయాల్లో బస్టాండ్లలో నిద్రించేవాడు. గుంతకల్లుకు చెందిన పాత నేరస్థుడు ఎ.మణిరత్నం అలియాస్ ఆర్ముగం తిరుపతిలో చిత్తు కాగితాలు సేకరించి అమ్ముకుని తిరుగుతుంటాడు. ఈ నెల 15వ తేదీ రాత్రి లక్ష్మణరావు బస్టాండులో నిద్రిస్తుంటే మణిరత్నం అతని దగ్గరకు వెళ్లి అగ్గిపెట్టె అడిగాడు. నిద్ర చెడగొట్టడంతో ఆగ్రహించిన లక్ష్మణరావు నిందితుడిని బూతులు తిట్టి కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు.
దీంతో కక్ష పెంచుకున్న మణిరత్నం కొద్దిసేపటి తర్వాత లక్ష్మణరావు నిద్రలోకి చేరుకోగానే అక్కడున్న బండ రాయి తీసుకుని లక్ష్మణరావు తలపై కొట్టి హతమార్చాడు. సీసీ కెమెరాలకు ఆధారాలు దొరకకూడదని రక్తపు మరకలు ఉన్న డ్రస్ మార్చుకొని దాన్ని కాల్చి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి అచూకీపై అందిన సమాచారంతో ఈ నెల 24న రైల్వేస్టేషన్ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై 2017లో మసీదులో హత్య చేసి ఆధారాలు చెరిపేసిన కేసు నమోదైంది. గతంలో కూడా పలు హత్యలు, దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.