AP Arogyasri Treatments: భారీగా ఆరోగ్యశ్రీ బకాయిలు, సేవలు కష్టమంటున్న ఆస్పత్రులు
AP Arogyasri Treatments: ఏపీలో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందించలేమంటూ నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాశాయి. నవంబర్ 27 తర్వాత ఆరోగ్య శ్రీ సేవలు అందించలేమని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి.
AP Arogyasri Treatments: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు వెయ్యి కోట్లను దాటిపోవడంతో ఇకపై చికిత్సలు అందించలేమంటూ ప్రైవేట్ ఆస్పత్రులు చేతులెత్తేశాయి.
ఏపీ ఆరోగ్య శ్రీ ట్రస్టు గత ఆరు నెలల్లో వివిధ ఆస్పత్రులకు దాదాపు రూ.వెయ్యి కోట్లు బకాయిపడిందని, వాటిని వెంటనే చెల్లించకపోతే సేవలను అందించడం కష్టమని ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ లేఖలో స్పష్టం చేసింది.నవంబర్ 27వ తేదీలోగా బకాయిలు విడుదలకు గడువు విధించింది.
మరోవైపు ఆరోగ్యశ్రీలో వివిధ చికిత్సలకు చెల్లించే ప్యాకేజీల ధరలు కూడా పెంచాలని ప్రైవేట్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుకు లేఖ రాసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ‘నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో కొన్నిచోట్ల 60 నుంచి 90 శాతం ఆరోగ్యశ్రీ చెల్లింపులపైనే ఆధారపడి నడుస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం నెలల తరబడి బిల్లులను చెల్లించక పోవడంతో తాము ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని చెబుతున్నారు.
ఆస్పత్రులకు ట్రస్ట్ చెల్లించాల్సిన రూ.వెయ్యి కోట్లు వెంటనే చెల్లించి, సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2013 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచలేదని పదేళ్ల క్రితం ధరలే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ రకాల వైద్య సేవలకు ఆరోగ్య శ్రీ టారిఫ్‌లను వెంటనే పెంచాలని, నెట్‌వర్క్ ఆస్పత్రుల సమస్యలు తెలిపేందుకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
ఆస్పత్రుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించడం లేదని, నవంబరు 27 తర్వాత నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించడం కష్టమని అసోసియేషన్ లేఖలో పేర్కొంది.
కొద్ది నెలల క్రితం ఇదే రకమైన సమస్య తలెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించడంతో రూ.400 కోట్ల వరకూ బకాయిలు విడుదల చేశారు. ఆ తర్వాత బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం వాటికి చెల్లించాల్సిన బిల్లులు రూ.వెయ్యి కోట్లకు చేరాయి. ఈహెచ్‌ఎస్‌లో ఉద్యోగుల చికిత్సలకు చెల్లించాల్సిన బిల్లులతో కలిపితే ఈ మొత్తం మరింత పెరుగనున్నాయి.
గత జూన్, జూలైలో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆందోళనకు దిగడంతో ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల యాజమాన్యాలతో అధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. ఇకపై ఆస్పత్రులకు బిల్లులు బకాయిలు ఉండవని, ప్యాకేజీల పెంపుపై కూడా తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. ఐదు నెలల్లో పెండింగ్ బిల్లులు రూ.1,000 కోట్లకు చేరాయి. మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానుండటంతో ఆస్పత్రులు కూడా బకాయిలు వసూలు చేసుకోవాలని తొందరపడుతున్నాయి. ఎన్నికల తర్వాత జాప్యం ఎక్కువ అవుతుందని ఆందోళన చెందుతున్నాయి.