Nellore Politics : నెల్లూరు సిటీలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్, అధిష్ఠానం నుంచి అనిల్ కు పిలుపు!-nellore city politics anil kumar yadav roop kumar issue reached tadepalli cm jagan calls anil kumar ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nellore Politics : నెల్లూరు సిటీలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్, అధిష్ఠానం నుంచి అనిల్ కు పిలుపు!

Nellore Politics : నెల్లూరు సిటీలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్, అధిష్ఠానం నుంచి అనిల్ కు పిలుపు!

Bandaru Satyaprasad HT Telugu
Jun 26, 2023 06:43 PM IST

Nellore Politics : నెల్లూరు సిటీ వైసీపీ నేతల మధ్య పంచాయితీ తాడేపల్లికి చేరింది. మాజీ మంత్రి అనిల్ కుమార్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ ను సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించారు.

తాడేపల్లికి చేరిన నెల్లూరు సిటీ పంచాయితీ
తాడేపల్లికి చేరిన నెల్లూరు సిటీ పంచాయితీ

Nellore Politics : నెల్లూరు సిటీ వైసీపీలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ వర్గపోరు నడుస్తోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ , ఆయన బాబాయ్ రూప్ కుమార్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరినొకరు బహిరంగంగానే తిట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనిల్ విజయం కోసం కష్టపడితే చివరికి తమపైనే దాడులు చేయించారని రూప్ కుమార్ ఇటీవల ఆరోపణలు చేశారు. దీంతో అనిల్ కుమార్ కూడా ధీటుగా స్పందించారు. గతంలో వీరి వివాదాల్లో జోక్యం చేసుకున్న సీఎం జగన్ ఒకసారి సర్దిచెప్పారు. కానీ పరిస్థితిలో మార్పురాలేదు. నెల్లూరు సిటీ వైసీపీలో విభేదాలు పరిష్కరించేందుకు సీఎం జగన్ మరోసారి రంగంలోకి దిగారు. అనిల్ కుమార్ యాదవ్ ను తాడేపల్లికి పిలిపించారు.

తాడేపల్లికి చేరిన పంచాయితీ

నెల్లూరు సిటీ వైసీపీ నాయకుల పంచాయితీ తాడేపల్లికి చేరింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ ను సీఎం జగన్‌ తాడేపల్లికి పిలిపించారు. గతంలో ఒకసారి అనిల్, రూప్ కుమార్ కు సీఎం జగన్ సర్దిచెప్పినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోగా.. పరస్పరం దాడులు చేసుకొనే స్థితి వచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీకి నష్టం వస్తుందని భావించిన జగన్‌.. మరోసారి వీరి సమస్యపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంపైనే అనిల్‌ కుమార్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌తో భేటీ అయిన అనిల్‌ కుమార్‌ ...బాబాయ్‌తో విభేదాలు రావడానికి గల కారణాలు వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సిటీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి, రాజకీయ పరిణామాలపైనా సీఎం జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

బాబాయ్ వర్సెస్ అబ్బాయ్

నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌ కుమార్ యాదవ్‌, నూడా ఛైర్మన్ ద్వారకానాథ్‌లకు ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. రూప్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లతో కూడా అనిల్‌ కుమార్ సత్సంబంధాలు లేవు. రూప్ కుమార్ యాదవ్ ప్రత్యేకంగా కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేసుకున్నారు. ఈ పరిణామాలను అనిల్ కుమార్‌ యాదవ్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. ఈ నియామకం విషయంలో అనిల్ కుమార్ ను పార్టీ సంప్రందిచలేదని ఆయన వర్గం అసంతృప్తిగా ఉంది. రూప్ కుమార్ కీలక అనుచరుడు అబ్దుల్ హాజీపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. రూప్ కుమార్ కు మద్దతుగా ఉన్నందుకే తనపై దాడి చేశారని అబ్దుల్ హాజీ ఆరోపించారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం అబ్దు్ల్ హాజీ పాటుపడ్డారని, అలాంటి వ్యక్తిపై హత్యాయత్నం చేయడం దారుణమని రూప్ కుమార్ అన్నారు. తనకు మద్దతుగా ఉన్నారనే కక్షతోనే పార్టీ నేతలు, కార్పొరేటర్ల ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పైకి నీతిమంతుడిగా చెప్పుకోవడం కాదని, నీ అనుచరులు ఏం చేస్తున్నారో చూసుకో అంటూ అనిల్ కుమార్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై నోరు జారితే పై నుంచి కింద వరకు చర్మం వలిచేస్తానని రూప్ కుమార్ పై అనిల్ ఫైర్ అయ్యారు. ఎవరో ఎవరిపైనో దాడి చేస్తే దానికి నాపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలో కౌంటర్ ఇచ్చారు.

Whats_app_banner