Fee Reimbursement: విద్యార్థుల ఫీజు బకాయిలపై నారా లోకేష్‌ గుడ్‌ న్యూస్‌.. విద్యార్థుల కష్టాలకు త్వరలో పరిష్కారం-nara lokesh good news on student fee reimbursement arrears ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Fee Reimbursement: విద్యార్థుల ఫీజు బకాయిలపై నారా లోకేష్‌ గుడ్‌ న్యూస్‌.. విద్యార్థుల కష్టాలకు త్వరలో పరిష్కారం

Fee Reimbursement: విద్యార్థుల ఫీజు బకాయిలపై నారా లోకేష్‌ గుడ్‌ న్యూస్‌.. విద్యార్థుల కష్టాలకు త్వరలో పరిష్కారం

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 23, 2024 06:41 AM IST

Fee Reimbursement: ఆంధ్రప్రదేశ్‌లో కోర్సులు పూర్తైనా ఫీజులు చెల్లించకపోవడంతో లక్షలాది విద్యార్థులు సర్టిఫికెట్లు అందక అవస్థలకు గురవుతున్నారు.ఏడాది కాలంగా కాలేజీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించక పోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి.ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి శుభవార్త వింటారని లోకేష్ ట్వీట్ చేశారు.

ఫీజు రియింబర్స్‌మెంట్‌ నారా లోకేష్‌ ట్వీట్
ఫీజు రియింబర్స్‌మెంట్‌ నారా లోకేష్‌ ట్వీట్

Fee Reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై త్వరలో శుభవార్త వింటారని మంత్రి లోకేశ్ మంగళవారం రాత్రి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్‌కు సంబంధించి విద్యార్థులు త్వరలోనే శుభవార్తను వింటారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. "వైసీపీ ప్రభుత్వం రూ.3500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించ కుండా మోసం చేసిందని, మంత్రులు, విద్యాశాఖలోని సహచరులతో కలిసి సమస్య పరిష్కరిస్తానని, త్వరలోనే శుభవార్త వింటారని హామీ ఇస్తున్నా అని 'ఎక్స్'లో ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు.

నిధులు ఉన్నా చెల్లించకుండా తాత్సారం..

ఏపీలో చివరి విడతగా గత మార్చి 1న విద్యాదీవెన నిధులను మాజీ సీఎం జగన్ విడుదల చేశారు. పామర్రులో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లిస్తున్నట్టు బటన్ నొక్కారు. విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత పక్షం రోజులకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

ఎన్నికల కోడ్‌ విడుదలయ్యే లోపు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేసేస్తున్నామని చెప్పినా అవి బటన్‌ నొక్కడానికి పరిమితం అయ్యాయి. ప్రభుత్వ ఖజానాలో సరిపడా నిధులు ఉన్నా వాటిని విద్యార్థులకు చెల్లించలేదు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన నిధులను విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్టు చెప్పారు.

జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను మార్చి 1న విడుదల చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు వసతి దీవెన నిధులు కూడా విడుదల చేస్తున్నట్టు జగన్ చెప్పుకున్నారు.

ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో వసతిదీవెన ఫీజులను రియింబర్స్ చేస్తున్నారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసిందని చెప్పారు.

ఎన్నికల కోడ్‌తో ఆగిన పంపిణీ..

విద్యాదీవెన బటన్‌ నొక్కినా తల్లుల ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో ఇప్పుడు ఫీజులు కట్టాలని కాలేజీలు విద్యార్ధులపై కొన్నినెలలుగా ఒత్తిడి చేస్తున్నాయి. కోర్సులు పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్ధులకు పోస్ట్‌ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ బకాయిలను చెల్లించకుండానే ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులను ఎన్నికలకు షెడ్యూల్ రావడానికి ముందే విడుదల చేసినా డబ్బులు మాత్రం విద్యార్ధుల ఉమ్మడి ఖాతాలకు చేరలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను 2019కు ముందున్న పేర్లుగా మార్చింది.

రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటి సదుపాయాలు, ఫ్యాకల్టీ, రేటింగులను బట్టి ఫీజులు ఉన్నాయి. మంచి కాలేజీల్లో సగటున రూ.77వేల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా మొదటి విడతగా రూ.19వేలు మాత్రమే విద్యార్ధుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన ఫీజు చెల్లించకపోతే డిగ్రీ అర్హత పత్రాలను జారీ చేయమని, మిగిలిన వారిని పరీక్షలకు హాజరు కానివ్వమని కాలేజీలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఇలా ఫీజు రియింబర్స్‌మెంట్ ద్వారా చదువుకుంటున్న విద్యార్ధులు దాదాపు పదిలక్షల మంది ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు.. అంటే పెద్ద చదువులు చదువుతున్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేశామని జగన్ చెప్పుకున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.3500కోట్లను బకాయిలుగా చెల్లించాల్సి ఉంది. వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

Whats_app_banner