Akhila Priya Couple Remanded : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసు, అఖిల ప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్-nandyal court remanded akhila priya couple till may 30 on tdp leader av subbareddy attack case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Akhila Priya Couple Remanded : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసు, అఖిల ప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్

Akhila Priya Couple Remanded : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసు, అఖిల ప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్

Bandaru Satyaprasad HT Telugu
May 17, 2023 09:23 PM IST

Akhila Priya Couple Remanded : టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిల ప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని కర్నూలు జైలుకు తరలించారు. నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గీయులు దాడి చేశారు.

భూమా అఖిల ప్రియ
భూమా అఖిల ప్రియ (Twitter )

Akhila Priya Couple Remanded : నంద్యాలలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ వర్గీయుల దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇరువర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదుతో భూమా అఖిలప్రియ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తాజాగా భూమా అఖిల ప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జడ్జి ఆదేశాలతో అఖిల ప్రియ దంపతులను పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. కొత్తపల్లి వద్ద టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిలప్రియ దంపతులను బుధవారం ఉదయం పాణ్యం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పర్చగా కోర్టు అఖిల ప్రియ దంపతులకు రిమాండ్ విధించింది.

తారాస్థాయికి వర్గపోరు

నంద్యాల జిల్లాలో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య అధిపత్య పోరు నడుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితులు అయితే నాగిరెడ్డి మరణం తర్వాత రాజకీయాలు మారిపోయాయి. చాలా రోజుల నుంచి కొనసాగుతున్న విభేదాలు తాజాగా తారాస్థాయికి చేరుకున్నాయి. లోకేశ్ పాదయాత్రలో మరోసారి రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ పరంగా త్రిసభ్య కమిటీ వేశారు. నిన్నటి ఘనటపై పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ఫైర్

నిన్న జరిగిన ఘటనపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి రెడ్డి స్పందించారు. తన తండ్రికి ఎలాంటి గాయాలు కాలేదని, నిన్నటి ఘటనలో షర్ట్ మాత్రమే చిరిగిందన్నారు. మాజీ మంత్రి అఖిల ప్రియపై జస్వంతి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమా నాగిరెడ్డి తాను, ఏవీ సుబ్బారెడ్డి వేరు కాదని చాలాసార్లు చెప్పారని జస్వంతిరెడ్డి అన్నారు. తండ్రి లాంటి వ్యక్తిపై దాడికి పాల్పడ్డారని ఆమె ఆవేదన చెందారు. చిన్నప్పటి నుంచి అఖిలప్రియను ఎత్తుకుని పెంచిన వ్యక్తిపై దారుణమైన ఆరోపణ చేస్తున్నారన్నారు. లోకేశ్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అఖిలప్రియ ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేయించారని మండిపడ్డారు. గతంలోను తమపై దాడి చేయించారని ఆరోపించారు. హైదరాబాద్ లో తమ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని, తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించేందుకు అఖిల ప్రియ కుట్ర చేశారని ఆరోపించారు. లో గ్రేడ్ ఆలోచనలతో అఖిలప్రియ ఇలాంటి పనులు చేసిందన్నారు.

Whats_app_banner