Balakrishna : ఒకడు నాశనం చేస్తాడు, హీరో జైలు నుంచి బయటకు రావాలి- అన్ స్టాపబుల్ లో బాలయ్య పొలిటికల్ పంచ్ లు!
Balakrishna Unstoppable Punches : మేం తలవంచమని మీకు తెలుసు, మనల్ని ఆపడానికి ఎవరూ రాలేడనీ తెలుసు అంటూ అన్ స్టాపబుల్ ప్రోమోలు బాలకృష్ణ పంచ్ డైలాగులు పేల్చారు. ఏపీ రాజకీయాలనుద్దేశించి బాలయ్య ఇలా మాట్లాడారని ప్రచారం జరుగుతోంది.
Balakrishna Unstoppable Punches : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు రోజుకో విధంగా నిరసన తెలుపుతున్నాయి. చంద్రబాబు అరెస్టై నెల రోజులు పైగా గడుస్తున్న బెయిల్ దొరక్కపోవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు టీడీపీ శ్రేణుల్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏపీ రాజకీయాలపై ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఆహా ఓటీటీలో చేస్తున్న అన్ స్టాపబుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 17న ప్రారంభం కానున్న అన్ స్టాపబుల్ తాజా సీజన్ కు సంబంధించి ప్రోమోను ఆహా ఓటీటీ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య పంచ్ లు పేల్చారు. ఏపీ రాజకీయ పరిస్థితులపై పరోక్షంగా బాలయ్య పంచ్ లు విసిరారు. దీంతో అన్ స్టాపబుల్ షోపై వీక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
చంద్రబాబు అరెస్టుతో మారిన రాజకీయం
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయం మారిపోయింది. స్కిల్ కేసు, ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు ఇలా వరుసగా చంద్రబాబు కేసులు నమోదు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ కేసులో అరెస్టు, రిమాండ్, కస్టడీ, బెయిల్, కోర్టుల నిర్ణయాలంటూ రోజుకో విషయం చంద్రబాబు గురించి బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నేత, హీరో బాలకృష్ణ తన అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు పేరు చెప్పకుండా పరోక్షంగా పంచ్ లు విసిరారు. ఈ పంచ్ డైలాగులు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినవే అని సగటు ప్రేక్షకుడికి సైతం అర్థమవుతుంది. వైసీపీ మద్దతుదారులు డైరెక్టర్ ఆర్జీవీతో ఏపీ రాజకీయాలపై, అధికార పార్టీకి మద్దతు సినిమాలు తీయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
హీరోలు జైలు నుంచి బయటకు రావాలి-బాలయ్య
బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి, ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ టీమ్ తో ఆహా అన్ స్టాపబుల్ తాజా సీజన్ ను ప్రారంభిస్తుంది. హీరోయిన్లు కాజల్,శ్రీలీల, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ షోల్ హల్ చల్ చేయనున్నారు. అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆహా ఓటీటీలో ఈ షో ప్రసారం కానుంది. ఈ షో ప్రోమోలో బాలయ్య పంచ్ డైలాగ్ షోపై మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. "మేం తలవంచమని మీకు తెలుసు, మనల్ని ఆపడానికి ఎవరూ రాలేడనీ తెలుసు" అంటూ బాలయ్య పంచ్ డైలాగ్ లు వైరల్ అవుతున్నాయి. "అనిపించింది అందాం, అనుకున్నది చేద్దాం, ఎవడాపుతాడో చూద్దాం" అంటూ బాలయ్య తనదైన శైలిలో షోను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. షోలో చంద్రబాబు అరెస్టుపై బాలయ్య ఏమైనా మాట్లాడారా? ఇలాంటి పంచ్ లు విసిరారా? అన్నది మరో మూడు రోజుల్లో తెలియనుంది. సినిమా అయినా లైఫ్ లో అయినా అంతా బాగున్నప్పుడు ఒకడు దిగుతాడు... మొత్తం నాశనం చేయటానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయటానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలంటూ బాలయ్య పంచ్ డైలాగులు వేశారు.