Nandyal District : పండగపూట విషాదం... రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు స్పాట్ డెడ్-mother and son died on the spot in a road accident in nandyal district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandyal District : పండగపూట విషాదం... రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు స్పాట్ డెడ్

Nandyal District : పండగపూట విషాదం... రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు స్పాట్ డెడ్

HT Telugu Desk HT Telugu
Sep 08, 2024 12:22 PM IST

Road Accident in Nandyal : పండగపూట నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆళ్ల‌గ‌డ్ఢ మండ‌ల పరిధిలో బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్ర‌మాదలో తల్లి, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పండ‌గ‌పూట జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో త‌ల్లీ కుమారుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతులు క‌డ‌ప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఆ కుటుంబంలో విషాదం నెల‌కొంది. ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషాద ఘ‌ట‌న శ‌నివారం నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్ఢ మండ‌లంలోని పేరాయిప‌ల్లె మెట్ట స‌మీపంలో జాతీయ ర‌హ‌దారిపై చోటు చేసుకుంది. తల్లీ, కుమారుడు ప్రయాణిస్తున్న ద్విచ‌క్ర వాహ‌నం అదుపుత‌ప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో త‌ల్లి, కుమారుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రొక‌రికి తీవ్ర గాయాలు అయ్యాయి. పండ‌గ కోసం స్వ‌గ్రామానికి వ‌స్తున్న త‌ల్లీ కొడుకు, ఇంటికి చేర‌కుండానే అనంత‌లోకానికి చేరుకున్నారు.

క‌డ‌ప జిల్లా వేంప‌ల్లి మండ‌లం నందిప‌ల్లెకు చెందిన కాంత‌మ్మ (40), ఆమె కుమారుడు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి (17), మ‌రో వ్య‌క్తి వెంక‌ట‌ర‌మ‌ణ‌తో క‌లిసి హైద‌రాబాద్ నుంచి ద్విచ‌క్ర వాహ‌నంపై స్వ‌గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో మార్గ‌మ‌ధ్యలో నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్ఢ మండ‌లంలోని పేరాయిప‌ల్లె మెట్ట వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై వీరు ప్ర‌యాణిస్తున్న ద్విచ‌క్ర‌వాహ‌నం ముందు వెళ్తున్న లారీని అదుపుత‌ప్పి ఢీ కొట్టింది.

లారీ కిందికి వెళ్లిన బైక్…!

దీంతో ద్విచ‌క్ర‌వాహ‌నం లారీ కింద‌కు వెళ్లింది. వీరి వాహ‌నం నుజ్జునుజ్జు అయింది. బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ముగ్గురు ప‌డిపోయారు. కాంత‌మ్మ, ఆమె కుమారుడు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. వెంక‌ట‌ర‌మ‌ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి హుటాహుటిన చేరుకున్నారు.

ఘ‌ట‌నా స్థ‌లాన్ని పోలీసులు ప‌రిశీలించి, కాంత‌మ్మ, ఆమె కుమారుడు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి మృత దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్ల‌గ‌డ్డ ఆసుపత్రికి త‌ర‌లించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వెంక‌ట‌ర‌మ‌ణ‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. నుజ్జునుజ్జు అయిన ద్విచ‌క్ర వాహ‌నాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీ గురించి పోలీసులు ఆరా తీశారు.

కాంత‌మ్మ‌, ఆమె కుమారుడు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించార‌ని తెలియ‌గానే కుటుంబ స‌భ్యులు ఆళ్ల‌గ‌డ్డ‌కు చేరుకున్నారు. పోస్టుమార్టం చేసి మృత దేహాల‌ను కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. దీంతో కుటుంబ స‌భ్యులు, బంధువులు రోద‌న‌లు మిన్నంటాయి. వీరిద్దరి మృతితో క‌డ‌ప జిల్లా వేంప‌ల్లి మండ‌లం నందిప‌ల్లె గ్రామంలో పండ‌గ‌పూట‌ విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. స్నేహితులు, బంధువులు క‌న్నీరు మున్నీరు అయ్యారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు