Minister Botsa Satyanarayana On DSC : డీఎస్సీ పరీక్ష నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన…. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ముందుగా టెట్ ఆపై డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో 18 ఏళ్లుగా శాశ్వత ఉద్యోగాల భర్తీ జరగలేదని… యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీలలో ఖాళీగా ఉన్న 3,200 ఉద్యోగాలకు నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఈ నియామకాలు చేపడతామని అన్నారు.
"ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కంటెంట్ మొత్తం బైజూస్ ఉచితంగా పిల్లలకి ఇస్తోంది. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బైజూస్‌కి చెల్లించట్లేదు. పిల్లలకు మంచి ఇంగ్లీష్ నేర్పడం కోసం టోఫెల్‌ను తీసుకొచ్చాం. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు టోఫెల్‌కి ఇచ్చేస్తున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
అమిత్ షాను లోకేశ్ కలిసి తన బాధను లోకేశ్ చెప్పుకోవచ్చని అన్నారు మంత్రి బొత్స. బీజేపీకి చెప్పి చేయాల్సిన అవసరం తమకు ఏదీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ... తెలుగుదేశం పార్టీకి బీ - టీమ్ అని ఆరోపించారు. అమిత్ షా దగ్గరికి పురందేశ్వరి, లోకేశ్ కలిసి వెళ్లారో లేక విడిగా వెళ్లారో తెలియదంటూ సెటైర్లు విసిరారు. నిన్నటి వరకు బీజేపీ కి తెలిసే అరెస్ట్ చేశారని టీడీపీ వాళ్లు అన్నారని... మరీ ఇప్పుడెందుకు ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ వాళ్లను కలిశారని ప్రశ్నించారు మంత్రి బొత్స.