Tuition Teacher: ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్ధినిపై ట్యూషన్ టీచర్ దాడి.. స్థానికుల దేహశుద్ధి
Tuition Teacher: పశ్చిమ గోదావరిలో ఓ దారి తప్పిన ట్యూషన్ టీచర్‌కు స్థానికులు దేహశుద్ధి చేశారు. ప్రేమపేరుతో విద్యార్థినిపై కొడవలితో దాడి చేయడంతో ఆగ్రహించిన గ్రామస్తులు నిందితుడిని చితక బాదారు.
Tuition Teacher: దారి తప్పిన ఓ ట్యూషన్ టీచర్ తన దగ్గర పాఠాలుsa చదువుకోడానికి వచ్చిన విద్యార్ధినిపై కన్నేశాడు. ప్రేమ పేరుతో ఆమెను లోబరుచుకోడానికి ప్రయత్నించాడు. మాస్టారి వికృత చేష్టల్ని విద్యార్ధిని ఇంట్లో చెప్పడంతో వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో నిందితుడిని కొన్నేళ్ల క్రితం కటకటాల వెనక్కి పంపారు. జైలు నుంచి వచ్చాక కూడా తీరు మార్చుకోని ఉపాధ్యాయుడు విద్యార్ధిని వెంట పడటం మొదలు పెట్టాడు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలానికి చెందిన విద్యార్థినిపై ట్యూషన్ టీచరు కొడవలితో దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. విద్యార్ధినిని కాపాడటానికి ప్రయత్నించిన ఆమె తల్లికి కూడా దాడిలో తీవ్ర గాయాలయ్యాయి.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన కొణతం నాగ వెంకట సుబ్రహ్మణ్యం (42) తెలుగులో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసి స్థానికంగా ట్యూషన్లు చెప్పుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అవివాహితుడైన సుబ్రహ్మణ్యం.. మూడేళ్ల క్రితం ట్యూషన్‌కు కోసం వచ్చిన పదో తరగతి విద్యార్థినితో చనువుగా ఉంటూ ప్రేమపేరిట వేధించే వాడు.
ఈ వ్యవహారంపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021లో ఉండి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఈ కేసు తర్వాత బాధిత బాలిక మరో ప్రాంతంలో ప్రైవేటు కళాశాలలో చేరి విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. అప్పటినుంచి ఆమెపై పగ పెంచుకున్న సుబ్రహ్మణ్యం అదను కోసం ఎదురు చూస్తున్నాడు.
సంక్రాంతి సెలవులకు విద్యార్ధిని స్వగ్రామానికి వచ్చినట్లు తెలుసుకుని మంగళవారం మధ్యాహ్నం కొడవలితో వారింట్లోకి చొరబడ్డాడు. విద్యార్థినితో ఘర్షణ పడి ఆమె మెడ, చేతులపై కొడవలితో గాయపరిచాడు. బాలిక అరుపులు విని నిందితుడిని అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె తల్లిపై కూడా దాడి చేశాడు. దీంతో విద్యార్ధిని తల్లి తీవ్రంగా గాయపడింది.
ఇంట్లో అరుపులు గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని నిందితుడిపై దాడి చేశారు. సుబ్రహ్మణ్యంకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన తల్లికుమార్తెలను 108 వాహనంలో భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తల్లీకూతుళ్లు కోలుకుంటున్నారని పోలీసులు తెలిపారు. స్థానికుల దాడిలో గాయపడిన నిందితుడు సుబ్రహ్మణ్యంను భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఉండి పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం, పోక్సో కేసులు నమోదు చేసినట్లు వివరించారు.