Dasara Liquor Problems: ఏపీలో దసరా పండుగకు తప్పని మందు కష్టాలు..మద్యం విక్రయాల్లో యథేచ్ఛగా దోపిడీ
Dasara Liquor Problems: ఏపీలో మద్యం దుకాణాల వేలం ఆలస్యం కావడంతో ప్రభుత్వ దుకాణాలు, బార్‌లకు కాసులు కురిపిస్తోంది. దుకాణాల వేలం ఆలస్యం కావడంతో దసరా పండక్కి మందు కటకట తప్పట్లేదు. దుకాణాల్లో నో స్టాక్, ఉన్న చోట దోపిడీ సాధారణమై పోయింది.
Dasara Liquor Problems: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం పాడాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో మద్యం దుకాణాల్లో గత రెండు వారాలుగా కొరత ఏర్పడింది. మొదట్లో దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో విక్రయాలకు అంతరాయం ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లో విక్రయాలు చేస్తున్నా ఎటూ పోయే ఉద్యోగం ఉంటే ఎంత, పోతే ఎంత అనుకుని అందిన కాడికి వసూలు చేస్తున్నారు.
ప్రతి బాటిల్‌పై రూ.10 నుంచి రూ.25వరకు బ్రాండ్‌ను బట్టి అదనంగా వసూలు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు పూర్తిగా మూతబడనుండటంతో ప్రభుత్వ దుకాణాల్లో విక్రయాలపై ఆంక్షల్ని లెక్క చేయడం లేదు. ఏపీబీసీఎల్ నుంచి మద్యం దుకాణాలకు సరఫరా చేసే బ్రాండ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. దుకాణాలకు బదులు బార్‌లకు సరఫరా చేయడం మేలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. దీంతో సేల్స్ ఎక్కువగా ఉండే బ్రాండ్లు మద్యం దుకాణాల్లో కనిపించడం లేదు. దసరా పండుగను ఉత్సాహంగా చేసుకునే అసంఘటిత రంగ కార్మికుల జేబులకు ఈ రూపంలో చిల్లు పడుతోంది.
మరోవైపు ప్రైవేట్ మద్యం దుకాణాలకు లైసెన్స్‌ల కేటాయింపు ప్రక్రియ దసరా నాటికి కొలిక్కి తేవాలని భావించినా మద్యం సిండికేట్ల దెబ్బకు గడువు తేదీ పొడిగించాల్సి వచ్చింది. శుక్రవారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు గడువు ఉంది. దుకాణాల లాటరీ ప్రక్రియను అనుకున్న గడువులోగా పూర్తి కాలేదు. దీంతో గత రెండు వారాలుగా బార్ అండ్ రెస్టారెంట్లకు కాసుల వర్షం కురుస్తోంది. ఎక్సైజ్ శాఖ కూడా వాటినే ప్రోత్సహిస్తోంది. దీంతో ప్రతి క్వార్టర్ మీద రూ.100 అదనంగా వెచ్చించాల్సి వస్తున్న అధికారులు చూసిచూడనట్టు వదిలేస్తున్నారు.
మరోవైపు ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గురువారం రాత్రి 8 గంటల కు 65,629 దరఖాస్తులు అందాయి. గురువారం ఒక్కరోజే 7,920 దరఖాస్తులు వచ్చాయి. నాన్ రిఫండ బుల్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1,312,58 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక్కో దరఖాస్తుకు రూ.రెోండు లక్షల డిపాజిట్ నిబంధనతో ఖజానాకు ఆదాయం సమకూరింది. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం సాయంత్రం వరకు గడువు ఉంది. చివరి రోజు మరో 20 వేల దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుల సంఖ్య 80 వేలు దాటే అవకాశముంది.
కాసులు కురిపించనున్న మద్యం వ్యాపారం..
గత ఆర్ధిక సంవత్సరంలో దాదాపు రూ.36వేల కోట్ల రుపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో డిస్టిలరీల నుంచి కొనుగోలు వ్యయాన్ని తీసేసినా దాదాపు రూ.30వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలకు 20శాతం కమిషన్ చెల్లింపు ప్రాతిపదికన మద్యం దుకాణాలు కేటాయిస్తున్నారు. దీంతో ఆదాయం పడిపోతుందనే వాదనలు కూడా ఉన్నాయి.
ఐదేళ్లుగా మద్యం వ్యాపారాలకు దూరంగా ఉన్న రాజకీయ నాయకులు కొత్త పాలసీ రావడంతో ఎమ్మెల్యేలతో కలిసి సిండికేట్లుగా మారిపోయారు. కొన్ని చోట్ల ఒక్కో దుకాణానికి సగటున 100కు పైగా దరఖాస్తులు చేస్తున్నారు. లాటరీలో దుకాణం దక్కితే కాసుల వర్షం కురుస్తుందనే అంచనాతోనే మద్యం వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. మద్యం వ్యాపారంలో వేలు పెట్టొద్దని చంద్రబాబు చెప్పినా ఎవరు ఖాతరు చేయడం లేదు. బయటి వారిని దరఖాస్తు చేయకుండా తక్కువ పోటీకి దుకాణాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
దరఖాస్తు ఫీజులతో భారీగా ఆదాయం..
రాష్ట్రంలోని 3,396 షాపులకు గురువారం సాయంత్రానికి 65,629 దరఖాస్తులు వచ్చాయి. వీటితో రూ.1,312.58 కోట్ల ఆదాయం సమకూరింది. శుక్రవారం చివరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. కనీసం మరో 15-20వేల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తు ఫీజుల ద్వారా రూ.1,600-1800 కోట్లఆదాయం వస్తుందని భావిస్తున్నారు. మద్యం దుకాణాలకు కనీసం లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేసినా ఎక్కడికక్కడ లిక్కర్ సిండికేట్లు అడ్డుపడి బెదిరింపులకు దిగడంతో చాలా చోట్ల దరఖాస్తు వేయడానికి కూడా ముందుకు రాలేదు. చివరకు గడువు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య కొంత పెరిగింది.