Bar Coucil Rules: లా డిగ్రీ ఇకపై సులువు కాకపోవచ్చు… బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు
Bar Coucil Rules: దేశంలో న్యాయవిద్యలో మెరుగైన ప్రమాణాలు సాధించడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక సంస్కరణల్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై నేర చరితులను బార్ అసోసియేషన్లలో నమోదు చేయకుండా వడపోత నిర్వహిస్తారు. బార్ కౌన్సిల్ అనుమతి లేకుండా అలాంటి వారిని అనుమతించకూడదని నిర్ణయించారు.
Bar Coucil Rules: న్యాయవాద వృత్తిలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కీలక సంస్కరణలను అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. న్యాయవాద వృత్తి గౌరవాన్ని ఇనుమడింప చేసేందుకు పలు కఠిన నిబంధనల్ని అమలు చేయనున్నారు.
రిజిస్ట్రేషన్ సమయంలో న్యాయవిద్య కోర్సుల్లో చేరే అభ్యర్ధులకు మార్కుల మెమోలను, పట్టా ఇచ్చేముందు వారి పూర్వాపరాలను పరిశీలించాలని, నేరచరిత్ర ఉన్న వారిని తమ అనుమతి పొందిన తర్వాతే లా పట్టా ఇవ్వాలని నిబంధన విధించింది.
దేశంలోని న్యాయవిద్య అందించే విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ వృత్తిలోకి వచ్చే వారిలో నైతిక ప్రమాణాలను పెంచడానికి, న్యాయవిద్యార్ధులకు నేరచరిత్ర ఉండరాదని, అందుకే వారి గత చరిత్రను తెలుసుకునే బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ అమలు చేయనున్నట్టు బార్ కౌన్సిల్ ప్రకటించింది.
విద్యార్థులకు మార్కుల పత్రాలు, డిగ్రీ పట్టాలను జారీచేసే ముందు విద్యార్థుల నేర చరిత్రను తీసుకోవాలని, వారిపై నమోదైన అభియోగాలు, ఎఫ్‌ఐఆర్ కాపీలే, కేసు దర్యాప్తు ఉన్న దశ, నేరం చేసిన తీవ్రత, అందుకే పడే శిక్ష తదితర వివరాలను విద్యార్థులు ముందే వెల్లడించాలని స్పష్టం చేసింది.
నేరచరిత్ర ఉన్న విద్యార్థుల వివరాలను బీసీఐకి పంపించి అక్కడ నుంచి అనుమతి వచ్చాకే విద్యార్థులకు పట్టాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనల అమలుపై విద్యార్థులు కూడా తమపై ఎలాంటి కేసులు, అభియోగాలు లేవని ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.
న్యాయ కళాశాలల్లో ప్రమాణాలు పడిపోతున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు విషయంలో కూడా కఠిన ఆంక్షల్ని అమలు చేయనున్నారు. ప్రతి న్యాయ కళాశాల బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. తరగతి గదులు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని బీసీఐ సిఫార్సు చేసింది.
లీగల్ ఎడ్యుకేషన్-2008 నిబంధనల ప్రకారం లా డిగ్రీ కోర్సుల్లో చేరే ముందు విద్యార్థులు తప్పనిసరిగా ఇతర రెగ్యులర్ కోర్సులు చదవడం లేదని హామీపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. పనిచేసే వారైతే తమ యాజమాన్యాల నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇస్తే తప్ప కోర్సుల్లో చేరడానికి వీల్లేదు. ఇతర సందర్భాల్లో విద్యార్థులు తాము ఎలాంటి కోర్సులు, ఉద్యోగం చేయడం లేదని పేర్కొనాల్సి ఉంటుంది.