Krishna Police Custodial Torture: చోరీ నెపంతో ఆదివాసీ మహిళలకు దారుణ హింస
Krishna Police Custodial Torture: జై భీమ్ సినిమాలో చోరీ నెపంతో ఆదివాసీలను దారుణ హింసకు గురి చేసిన తరహా ఘటన కృష్ణా జిల్లాలో నిజంగానే చోటు చేసుకుంది. ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో మహిళా ఎస్సై అత్యంత కిరాతకంగా ఎస్టీ మహిళల్ని హింసించిన ఘటన వెలుగు చూసింది.
Krishna Police Custodial Torture: ఎన్ని చట్టాలు చేసినా, సంస్కరణలు తీసుకొచ్చినా గ్రామాల్లో పెత్తందారుల స్వభావాల్లో మార్పు రావడం లేదు. రాజకీయ పలుకుబడి ముందు సాగిలపడే పోలీస్ వ్యవస్థతో అలాంటి వాళ్లు మరింత పేట్రెగి పోతున్నారు. కృష్ణాజిల్లాలో చోరీ నెపంతో ముగ్గురు యానాదీ మహిళల్ని వైసీపీ నాయకుడు దారుణంగా హింసించాడు. అంతటితో ఆగకుండా పోలీసులతో టార్చర్ చేయించాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడటం కలకలం రేపింది. ఎస్టీ కమిషన్ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది.
కృష్ణా జిల్లా మోపిదేవిలో అత్యతం అమానుషమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దొంగతనం ఆరోపణతో ఆదివాసీ బాలికపై వైసీపీ నాయకుడు, స్థానిక మహిళ ఎస్సైలు కలిసి దారుణంగా హింసించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కె.కొత్త పాలెం గ్రామ వైసీపీ కన్వీనర్ మత్తి రాజాచంద్ అలియాస్ రాజబాబు ఈ నెల 20వ తేదీన ఇంట్లో శుభకార్యం నిర్వహించాడు. ఆ రోజు ఇంట్లో పనులు చేయడానికి గ్రామానికి చెందిన యానాది బాలికను పిలిచాడు. ఆమెకు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. ఈ కార్యక్రమం ముగిసిన మర్నాడు రాజాబాబు ఇంట్లో చెవిదిద్దులు కనిపించడం లేదని గుర్తించి 21వ తేదీన బాలిక ఇంటికి వెళ్లి నిలదీశాడు. ఆమె తనకు తెలియదని చెప్పినా వినకుండా ఇంట్లోకి దూసుకెళ్లి సామగ్రిని చిందర వందర చేశాడు.
అక్కడే బాలికను తీవ్రంగా కొట్టి బైక్‌పై ఎక్కించుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. చెవిదిద్దులు ఎక్కడున్నాయో చెప్పాలంటూ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి స్రవంతితో కలసి దుర్భాషలాడుతూ హింసించాడు. బాలికను కడుపులో తన్నడం, తలను దివాన్‌కాట్‌కు కొట్టడంతో రక్త స్రావమైంది. దెబ్బలకు తాళలేక వాంతులు చేసుకున్నా కనికరించలేదు.
నేరం ఒప్పుకోకపోతే ఇంటిని తగలబెడతానని బెదిరించడంతో భయపడిన బాలిక వారు కోరినట్టుగా చెప్పింది. ఆమె మాటల్ని వీడియోలో చిత్రీకరించాడు. ఆ తర్వాత బాలిక పిన్ని పద్మ, అమ్మమ్మ రమణమ్మలను ఇంటికి పిలిపించి వారిని కూడా రాజబాబు తీవ్రంగా కొట్టాడు.
బాలిక చెవిపోగులను బలవంతంగా లాక్కుని ఆ ముగ్గురిని మోపిదేవి పోలీసుస్టేషన్‌లో అప్పగించాడు. మోపిదేవి ఎస్సై పద్మ సైతం నిందితుడి మాటల ఆధారంగా అతని సమక్షంలోనే బాలికతో పాటు ఆమె పిన్ని, అమ్మమ్మలను తీవ్రంగా హింసించింది. మహిళల శరీరంపై వాతలు వచ్చేలా అర్థరాత్రి వరకు కొట్టారు. మరుసటి రోజు ఉదయాన్నే చెవిదిద్దులను తీసుకురావాలని ఆదేశించారు. ఆ దెబ్బలతోనే 22న ఉదయం ముగ్గురూ స్టేషన్‌కు వచ్చారు.
22వ తేదీ రాత్రి వరకూ పడిగాపులు కాసినా ఎస్సై పద్మ స్టేషన్‌కు రాలేదు. దీంతో మరుసటి రోజు రావాలని స్టేషన్ సిబ్బంది పంపించేశారు. ఆదివారం రాత్రికి దెబ్బలతో ముగ్గురి పరిస్థితి విషమించింది. రాజాబాబు, ఎస్సై ఆగడాలకు భయపడిన బాధితులు భయంతో ఆసుపత్రికి వెళ్లలేదు.
22వ తేదీ రాత్రి భరించలేని నొప్పులతో తల్లడిల్లుతున్న బాధితులను బాలిక అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఇన్‌పేషంట్లుగా చేరాలని వైద్యసిబ్బంది సూచించడంతో మరుసటి రోజు మోపిదేవి స్టేషన్‌కు వెళ్లనట్లయితే ఎస్సై బతకనీయరంటూ అక్కడే గడిపారు. ఇన్‌పేషంట్‌గా చేరకపోతే ఆస్పత్రిలో ఉండకూడదని వైద్య సిబ్బంది చెప్పడంతో ఆసుపత్రి వెలుపల ఉన్న మదర్‌థెరిసా విగ్రహం ఉండిపోయారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వైద్యులు బాధితులకు చికిత్స అందించారు. బాధితులను ఎస్టీ కమిషన్ సభ్యులు పరామర్శించారు. నిందితుడు రాజబాబు మీద ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టాల కింద అరెస్టు చేశారు. నిందితుడికి మొవ్వ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడికి సహకరించిన మహిళా పోలీస్‌తో పాటు మోపిదేవి ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళా కార్యదర్శి స్రవంతితో పాటు అనిశెట్టి బాబురావులపై కేసు నమోదు చేసినట్లు అవనిగడ్డ డిఎస్పీ ప్రకటించారు.మహిళా ఎస్సై పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.