Pawan Kalyan : కాపుల ఆత్మగౌరవాన్ని నేనెప్పుడూ తగ్గించను... పవన్ కళ్యాణ్
Pawan Kalyan : కాపు నాయకులు సమాజానికి పెద్దన్న పాత్ర వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజకీయ సాధికారత కావాలంటే కాపులంతా ఏకం కావాలని అన్నారు. కాపుల ఆత్మగౌరవాన్ని తానెప్పుడు తగ్గించనని... ఏ పార్టీ అజెండా కోసం పనిచేయడం లేదని తేల్చి చెప్పారు. టీడీపీతో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోమని స్పష్టం చేశారు.
Pawan Kalyan : రాజకీయ సాధికారత కావాలంటే కాపులంతా ఏకం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాపు నాయకులు సమాజానికి పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు. పెద్దన్న పాత్ర అంటే.. వేరే కులాల వారిని ఆదరించడం.. ప్రేమించడం అని.. ఈ తరహాలో అందరినీ కలుపుకొని పోవాలని చెప్పారు. కులం నుంచి తానెప్పుడూ పారిపోను అని స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాపు సంక్షేమ సేన సదస్సులో మాట్లాడిన పవన్ కళ్యాణ్... కాపులకు ఏదైనా మంచి జరగాలంటే అది తానే చేయగలననని అన్నారు. ఇతర కులాలను విమర్శించే బదులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కాపులు అధికారంలోకి వస్తే ఇతరులను తొక్కేస్తారని విష ప్రచారం చేస్తున్నారని... అధికారం ఏ ఒక్కరి సొత్తూ కాదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు.
కాపులు, బీసీలు, ఎస్సీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలతో గొడవలు వద్దని హితవు పలికారు. ముందు నుంచి యుద్ధం చేస్తున్నా.. వెన్నుపోట్లు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ టీడీపీతో ఎలాంటి లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోదని.. మా ఆత్మగౌరవం తగ్గించుకోం.. ఎవరి అజెండా కోసం పనిచేయమని తేల్చి చెప్పారు. ఇటీవల వచ్చిన విమర్శలపై స్పందించిన ఆయన... రూ. వెయ్యి కోట్లతో రాజకీయాలు చేయలేమని.. పార్టీని నడపలేమని వ్యాఖ్యానించారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని.. అందుకే ఓడిపోయానని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటేయాలని... ఒకవేళ డబ్బు తీసుకున్నా వైఎస్ఆర్సీపీకి మాత్రం వేయవద్దని అన్నారు.
"చాలామంది నేతలు కాపులను వాడుకుని పదవులు సంపాదిస్తున్నారు. కులాలను విడగొట్టి లబ్ధి పొందే నాయకులు ఎక్కువయ్యారు. 2008-09లో జరిగిన సంఘటనలు నాలో పంతం పెంచాయి. సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత ఉండదు. సంఖ్యాబలం ఉన్నా కాపులు అధికారానికి దూరంగా ఉన్నారు. రామ్‌మనోహర్ లోహియా కలలు సాకారం చేసేందుకు జనసేన కృషి చేస్తుంది. ఉపాధి, ఉద్యోగాలు కావాలని అడిగే స్థితిలోనే ఇంకా ఉన్నాం. రాయలసీమలో గనుల దోపిడీపై బలిజలు పోరాడాలి. మనం ఐక్యంగా ఉంటే వేరేవాళ్లు అధికారంలోకి రావడం అసాధ్యం. కాపులు కూడా కట్టుబాటు తీసుకోవాలి. కాపుల ఆత్మగౌరవాన్ని నేనెప్పుడూ తగ్గించను. ఏ పార్టీ అజెండా కోసం మేం పనిచేయడం లేదు. జనసేనను నమ్మినవారి ఆత్మగౌరవాన్ని మేం తగ్గించం. ఇతర పార్టీల అజెండా కోసం మేం పనిచేయం. నాకు సమాజంపై ఎంతో ఇష్టం ఉంది కనుకే ఓర్పుతో ఉన్నా. ప్రతిచోటా సోషల్ ఇంజినీరింగ్ జరగాలి" అని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
గత ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడినవారు ఇప్పుడెందుకు మాట్లాడరు ? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కాపుల వైపు నిలబడబోమని చెప్పినా ఓటేసి గెలిపించారని... కుల ఆత్మగౌరవాన్ని చంపుకుని మరీ వైకాపాకు ఎందుకు ఓటేశారు ? అని అడిగారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడారా? అని పవన్ నిలదీశారు.