Mlc Anantha Babu Case : ఎమ్మెల్సీ అనంతబాబు కేసు సీబీఐకి?, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Mlc Anantha Babu Case : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరిగాలేదని, సీబీఐకి అప్పగించాలని బాధితుడి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కోర్టులో వాదనలు ముగిశాయి.
Mlc Anantha Babu Case : వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కేసులో ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎమ్మెల్సీ అనంత బాబు తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం అయింది. ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల ఆందోళనతో పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎమ్మెల్సీ అనంత బాబు తరుపున ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించగా, హైకోర్టు పలు ప్రశ్నలను సంధించింది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను ఎందుకు నిందితురాలిగా చేర్చలేదని కోర్టు ప్రశ్నించింది. సీసీ విజువల్స్ లో ఉన్న వారిని ఎందుకు కేసులో చేర్చలేదని ప్రశ్నించింది. కేవలం ఎమ్మెల్సీ అనంత బాబును మాత్రమే కేసులో ఎందుకు చేర్చడం కోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు సరిగా చేయలేదని, సహ నిందితుల్ని వదిలేశారని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా కేసు వివరాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు ప్రభుత్వం అందించింది.
హైకోర్టు అభ్యంతరం
సింగిల్ జడ్జి ఆదేశాలకు అనుగుణంగా అనుబంధ ఛార్జ్‌షీట్ లేదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. డ్రైవర్ హత్య కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని బాధితుడి తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారించింది. పిటీషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది శ్రవణ్. కోర్టు ఆదేశించినా సీసీటీవీ కెమెరా విజువల్స్ లో ఉన్నవారిని పోలీసులు పట్టుకోలేదని హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ హత్యలో వారి పాత్ర లేదని ఎలా నిర్దారణకు వచ్చారు కోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆ వివరాలను అదనపు ఛార్జ్‌షీట్‌లో ఎందుకు పేర్కొనలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
బెయిల్ పై అనంతబాబు
ఈ కేసును సీబీఐకి ఇవ్వొద్దని ఎమ్మెల్సీ అనంతబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన వాదనలు వినేందుకు హైకోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. మాజీ డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతబాబును అరెస్టు చేసిన 90 రోజులు దాటినా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం, పలు కారణాలు ఛార్జ్ షీట్ దాఖలు ఆలస్యం చేయడంతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దోషులను తప్పించేందుకు దర్యాప్తు చేయడం లేదని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీబీఐ విచారణతో తమను న్యాయం జరుగుతోందని, ఈ కేసులో సీబీఐకి అప్పగించాలని కోర్టును కోరారు.