Kadapa News : విద్యార్థి మంచం కింద భారీ కొండచిలువ, కడప ట్రిఫుల్ ఐటీలో కలకలం!
Kadapa News : కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కొండచిలువ కలకలం సృష్టించింది. హాస్టల్ లోని ఓ విద్యార్థి మంచం కింద కొండచిలువను గుర్తించారు. దీంతో విద్యార్థులు భయంతో హాస్టల్ బయటకు పరుగులు తీశారు.
Kadapa News : కొండ చిలువను అల్లంత దూరంలో చూస్తేనే హడలిపోతుంటాం. అలాంటిది మనం నిద్రపోతున్న మంచం కింద కొండ చిలువ ఉంటే ఇంకేమైనా ఉందా? గుండె ఆగినంత పనైపోతుంది. ఇలాంటి ఘటనే కడప జిల్లాలో జరిగింది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని ఓ హాస్టర్ లో కొండచిలువ కలకలం రేపింది. బాయ్స్ హాస్టల్-2లో ఓ విద్యార్థి మంచం కింద కొండ చిలువ దూరింది. విద్యార్థులు కొండ చిలువను చూడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొండ చిలువను చూసిన విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు పరుగులు తీశారు.
హాస్టల్ లోకి కొండ చిలువ
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని బాయ్స్ హాస్టల్ లోకి భారీ కొండచిలువ చేరింది. హాస్టల్ లోని ఓ విద్యార్థి మంచం కిందకు చేరిన భారీ కొండ చిలువ చుట్ట చుట్టుకుని ఉంది. దీనిని గుర్తించారు విద్యార్థులు...భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణికి తెలియజేశారు. దీంతో ఆమె అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సిబ్బంది ట్రిఫుల్ ఐటీ హాస్టల్ వద్దకు చేరుకుని కొండ చిలువను గోనెసంచిలో బంధించారు. అనంతరం దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి వదిలేశారు. దీంతో విద్యార్థులతో హాస్టల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే హాస్టల్ గదిలోని కొండ చిలువ ఎలా వచ్చిందని సిబ్బంది ఆరా తీస్తున్నారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలను పరిశీలించాలని అటవీ అధికారులు సూచించారు.
మెకానిక్ షాపులో 13 అడుగుల పాము
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. ఎస్.కోటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఇటీవల 13 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా ఆటో మెకానిక్ షాపులోకి వెళ్లింది. గిరి నాగును గమనించిన ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. స్థానికులు స్నేక్ క్యాచర్ వానపల్లి రామలింగేశ్వరరావుకు సమాచారం అందించారు. అతడు కింగ్ కోబ్రాను బంధించేందకు ప్రయత్నించారు. అయితే గిరినాగు అతడిని ముప్పు తిప్పలు పెట్టింది. చివరికి స్నేక్ క్యాచర్ రామలింగేశ్వరరావు కింగ్ కోబ్రాను సంచిలో బంధించారు. పామును పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తాటిపూడి రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రాను విడిచిపెడతానని స్నేక్‌క్యాచర్ రామలింగేశ్వరరావు తెలిపారు.