Andhra Thanos : దత్తపుత్రుడంటే థానోస్‌ అంటానన్న పవన్ కళ్యాణ్‌-janasena pawan kalyan named cm jagan as thanos of avengers movie ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Thanos : దత్తపుత్రుడంటే థానోస్‌ అంటానన్న పవన్ కళ్యాణ్‌

Andhra Thanos : దత్తపుత్రుడంటే థానోస్‌ అంటానన్న పవన్ కళ్యాణ్‌

HT Telugu Desk HT Telugu
Aug 22, 2022 07:06 AM IST

తనను దత్తపుత్రుడని పిలిస్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రా థానోస్ అని పిలుస్తామన్నారు పవన్ కళ్యాణ్‌. రాష్ట్రంలో సంక్షేమం పేరుతో ప్రజల్ని హింసిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రా థానోస్‌కు ఆరాటమెక్కువ, ఆలోచన తక్కువని ఎద్దేవా చేశారు. తమను గౌరవించే పక్షాలతో కలిసి పని చేయడానికి ఎలాంటి అభ్యంతరం తమకు లేదని పవన్ స్పష్టం చేశారు.

<p>జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌</p>
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌

"అవెంజర్స్" సినిమాలో థానోస్ అనే పాత్ర మాదిరి ఆంధ్రా సిఎం ప్రవర్తిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ విమర్శించారు. కనిపించిన వారిని కనిపించినట్లుగా చంపుకొని పోతూ ఉంటాడని, ఆరు రత్నాల ఉంగరాలతో అత్యంత బలవంతుడిగా మారే థానోస్ తాను చేసింది మంచే అని భావిస్తాడని ఈ క్రమంలో సగం మందిని చంపేస్తాడని ఎద్దేవా చేశారు. ఎవరు చెప్పినా వినిపించుకోడని నేను చేసిందే కరెక్ట్‌ అనేది థానోస్ భావనలో ఉంటాడని, ఆంధ్రా థానోస్ కూడా అంతే అన్నారు. సిఎం జగన్‌ నవరత్నాలతో ప్రజలకు అంత మేలు చేసేస్తున్నామని అనుకుంటూ ఎవర్ని వదలకుండా చంపేస్తున్నాడని, ఆంధ్రా థానోస్ కు ఆరాటం ఎక్కువ, ఆలోచన తక్కువన్నారు. తనను దత్త పుత్రుడు అని పిలుస్తున్నారని ఇక నుంచి వైసీపీ ముఖ్యమంత్రిని ఆంధ్రా థానోస్ గా పిలుస్తానన్నారు.

జనసేన పార్టీ చేపట్టిన జనవాణి - జనసేన భరోసా యాత్ర కార్యక్రమం లో రాయలసీమలోని నాలుగు జిల్లాల ప్రజలతోపాటు నెల్లూరు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పవన్ కళ్యాణ్‌కు కి తమ సమస్యల మీద అర్జీలు సమర్పించారు. మొత్తం 415 అర్జీలను పవన్ కళ్యాణ్ స్వయంగా అందుకున్నారు. "జనవాణి కార్యక్రమం వల్ల రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద, ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీద ఎన్నో విషయాలు దృష్టికి వచ్చాయని, రోడ్లు, ఫీజు రియంబర్స్మెంట్, టిడ్కో ఇళ్లు, వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలు, అక్రమ మైనింగ్, శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం దోపిడీ ఎన్నెన్నో విషయాలు తెలిశాయన్నారు.

కోస్తాలో దళితులకు అన్యాయం జరిగితే వారు చెప్పగలరని, రాయలసీమ ప్రాంతంలో దళితులకు అన్యాయం జరుగుతున్న వారిని అవమాన పరుస్తున్న బయట కూడా చెప్పలేని దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువ మంది ముఖ్యమంత్రులు పాలించారని గుర్రాల కోసం ప్రత్యేకంగా హార్స్ క్లబ్ లు నిర్వహించే విలాసవంతమైన నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారని, వేల కోట్ల రూపాయలు అర్జించిన నేతలు ఉన్నా ఈ ప్రాంతం పరిస్థితి ఏ మాత్రం మారడం లేదన్నారు. ప్రజల బతుకులు అలాగే ఉన్నాయని సాగునీటి కాలువల పూడికలు తీయించలేని పాలకులు వాటి కోసం కనీసం రూ. 10 లక్షలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నారన్నారు

అడిగితే అక్రమ కేసులే…

వైసీపీ నాయకుల దౌర్జన్యాలను ప్రశ్నిస్తే, పాలన వైఫల్యాలను చెబితే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పంచాయతీ నిధులు దుర్వినియోగం గురించి అడిగితే, అతని పొలంలోని 95 మామిడి చెట్లను నరికేశారని, తొమ్మిది బోర్లు ధ్వంసం చేశారని తప్పు ఎత్తిచూపితే కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఏదైనా సమస్యను ఎత్తిచూపితే వారిని నాన్ బెయిలబుల్ కేసుల్లో ఇరికిస్తున్నారని ఈ దౌర్జన్యాలను ఎదిరించాలన్నారు.

కచ్చితంగా రాజకీయ చైతన్యం రాయలసీమ వాసుల్లో రావాలని గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిన పూతలపట్టు ఎమ్మెల్యేను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని ప్రశ్నించిన యువకుడుపై, అతడికి మద్దతు తెలిపిన 11 మందిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని పవన్ ఆరోపించారు.

మీ మోచేతి అంబలి తాగాల్సిన అవసరం లేదు

ప్రతి కులంలోనూ ఎందరో మహానుభావులు ఉన్నారని కానీ కొన్ని కులాల వారు మాత్రమే తాము పెద్దవాళ్ళం అనే ఆధిపత్య ధోరణిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాల్లో జనాభా అధికంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం వెనుకబడిన స్థానంలో ఉన్నారు. దీనికి ఆయా కులాలకు రాజకీయ సాధికారత లేకపోవడం కారణమని, ఈ కారణంతో కొన్ని కులాలు చెప్పినట్లుగానే అధిక జనాభా ఉన్న వెనుకబడిన కులాలవారు నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అగ్రవర్ణ కులాలకు చెందిన యువత తమ వంతు బాధ్యతగా వెనుకబడిన కులాల వారికి అండగా నిలబడాలన్నారు. వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్ళాలని, రాష్ట్రంలో కులాల మధ్య అసమానతలు ఉన్నాయని, కుల దూషణలు ఎక్కువేనని ఇది పూర్తిగా మారాలన్నారు.

మూడో ప్రత్యామ్నాయం కచ్చితంగా ఉండాలి…

న్యాయవ్యవస్థ విషయంలోనే సింగిల్ బెంచ్ నుంచి ఐదుగురు సభ్యుల బెంచ్ వరకు వివిధ రకాల స్థాయిలో న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయాల్లో కూడా కచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం అవసరమని పవన్ చెప్పారు. జనసేన పార్టీ ఎప్పుడూ వైసీపీకో , టీడీపీ కొమ్ము కాయడానికో లేదని మార్పు కోసం బలమైన రాజకీయం చేస్తామని, కచ్చితంగా మార్పు వచ్చే వరకు నిలబడి పోరాడుతామని బరిలో నిలుస్తామే తప్ప పారిపోయేది లేదన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ కోవర్టుల వల్లే ప్రజారాజ్యం పతనం

2009లో ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రంలో బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని చాలామంది భావించారు. ఎందరో వెనుకబడిన వర్గాల వారు, మేధావులు, అభ్యుదయవాదులు మార్పు కోసం ముందుకు వచ్చారు. ఆ రోజుల్లో కొందరు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబ కోవర్టులు వల్ల పార్టీ నిలబెట్టుకోలేకపోయామని పవన్ చెప్పారు. తర్వాత వారందరికీ విధేయతకు మెచ్చి మంచి మంచి పదవులు లభించాయి. ప్రజారాజ్యం విలీనం తర్వాత ఒక బలమైన మార్పు తీసుకువచ్చే వరకు పోరాడాలని నిర్ణయం తీసుకున్నాను. కచ్చితంగా బరిలో నిలబడి పోరాడుతూనే ఉంటానని ఎవరికీ తలవంచేది లేదని సమయం కోసం వేచి చూస్తున్నాం అన్నారు.

2014లో మద్దతు ఇచ్చింది అందుకే...

తెలుగుదేశం పార్టీకి 2014లో మద్దతు ఇవ్వడం వెనుక ఉన్న అసలు విషయం చాలా ఉంది. కొత్తగా విభజన అయిన రాష్ట్రం లో పాలకులు చేసిన కొన్ని తప్పులకు ఆంధ్ర ప్రజలను తిడుతున్నారు అని ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీని కలిసినప్పుడు చెప్పానని, ఇలా ఐతే దేశం విచ్చినం అవుతుందని, అలా జరగనివ్వబోమని మోదీ చెప్పారని తర్వాత నరేంద్ర మోదీ తాము ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళుతున్నట్లు, మద్దతు కావాలని అడడగంతోనే టీడీపీ కీ మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కులం అంటే గౌరవం తప్ప.. కుల పిచ్చి, కులాభిమానం ఉండదని 2014లో మేము ఎన్నికలకు వెళ్లకుండా బేషరుతుగా మీకు మద్దతు ఇవ్వాలంటే మీరే మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి, మాతో మాట్లాడితే బాగుంటుందని చంద్రబాబు నాయుడుకు చెప్పానని ఆయన ఇంటికి వచ్చి జనసేన పార్టీ మద్దతు అడిగారని గుర్తు చేశారు. ప్రజారాజ్యం పార్టీ తర్వాత మూడవ ప్రత్యామ్నాయం పోయిందని చాలామంది బాధపడ్డారని, గతంలో జరిగిన తప్పునకు బేషరతుగా క్షమాపణ చెప్పానన్నారు.

తమను గౌరవించి, తగిన విధంగా ఆత్మాభిమానాన్ని గౌరవిస్తేనే ఎవరితో అయినా చెలిమి ఉంటుందని వచ్చే ఎన్నికలలో ఎవరితో కలిసి పోటీ చేయాలి అనేది ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. కానీ రాష్ట్రంలో ఒక విధ్వంసకర పరిపాలన ఉన్నప్పుడు శత్రువులతో కూడా కలవాల్సి ఉంటుందని రాజకీయాల్లో తప్పదని దీనిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. మమ్మల్ని మా నాయకుల్ని గౌరవంగా చూసేవారు.. తగిన ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం మాకు నింపేవారు ఉంటే అప్పుడు మాట్లాడతామని చెప్పారు.

Whats_app_banner