Janasena Yuvasakthi : వారిద్దరి భేటీపై భయం ఎందుకు…?
Janasena Yuvasakthi తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌ల భేటీపై వైసీపీకి ఉలికిపాటు ఎందుకని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఏపీలో జగన్ పాలన నుంచి విముక్తి కోసం విపక్షాలు సంప్రదింపులు జరుపుతూనే ఉంటాయన్నారు. మంత్రులు పాలన వదిలేసి చవకబారు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Janasena Yuvasakthi పవన్‌కళ్యాణ్, చంద్రబాబు నాయుడుల భేటీపై వైసీపీ మంత్రులు ఎందుకు ఉలికిపడుతున్నారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వైసీపీ నుంచి విముక్తం చేయడానికి విపక్షాల మధ్య సంప్రదింపులు జరుగుతూనే ఉంటాయన్నారు. రెవిన్యూ మంత్రి చవకబారు మాటలు మాట్లాడుతున్నారని, వైసీపీ అధికారంలో ఉంటే రాష్ట్రానికే నష్టమన్నారు.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి నష్టమని, రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆ నష్టాన్ని నివారించేందుకు విపక్షాల సంప్రదింపులు సాగుతూనే ఉంటాయని నాదెండ్ల చెప్పారు.పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును కలిస్తేనే వైసీపీ నాయకులు ఇంత భయపడటం ఎందుకని ప్రశ్నించారు. ప్రజలు వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఇచ్చారని, వారిని మెప్పించేలా పాలన చేసి, ప్రజల మన్ననలు అందుకోవాల్సిన వారు, పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారం సమావేశాలు భయపడడం మానాలన్నారు.
"వైసీపీ నాయకులు మొదట పాలన చేయడం నేర్చుకోవాలని, చవకబారు మాటలు, విమర్శలు మాని సుపరిపాలన అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి 175 సీట్లను గెలుచుకోవాలని చెప్తున్నాడని, దానికి తగినట్లుగా పరిపాలించండన్నారు. పవన్ కళ్యాణ్‌ను తిట్టడమే లక్ష్యంగా చేష్టలు మానుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ గత ఏడాది మార్చి 14వ తేదీన జరిగిన ఇప్పటం సభలోనే విపక్షాల ఓట్లను చీలనివ్వమని బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి మరిన్ని సంప్రదింపులు ఉంటాయన్నారు. కచ్చితంగా వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడం కోసం పని చేస్తామన్నారు.
ధర్మాన మాటలకు ముఖ్యమంత్రిదే బాధ్యత….
రాష్ట్రంలో మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని, ఓ మంత్రి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే మరొక మంత్రి ఇక్కడి నుంచే పాలన అంటారని, రెవెన్యూ మంత్రి ఏకంగా ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలని చెబుతున్నారని క్యాబినెట్లో మంత్రి అన్న మాటలకు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలన్నారు. మంత్రి మాటలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర మీద కపట ప్రేమ చూపిస్తున్న వైసీపీ నాయకుల ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని, కచ్చితంగా వారు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. జనసేన ప్రజల పక్షాన మాట్లాడుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాని వైపు మాత్రమే జనసేన పార్టీ ఉంటుందన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు దారుణంగా పెరిగిందని నాదెండ్ల ఆరోపించారు. దేశవ్యాప్తంగా సగటున 6 శాతం ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 9.4 శాతం ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో నాలుగు శాతం మాత్రమే ఉందని దీనిపైన పాలకులు సమాధానం చెప్పాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు భారీగా పెరిగిపోతున్నాయని, పొట్ట చేత పట్టుకుని దేశం నలుమూలలకు ఉత్తరాంధ్ర ప్రజలు వెళ్లిపోతున్నారన్నారు. గతంలో వచ్చిన పరిశ్రమలకు కొత్త పరిశ్రమలకు ఈ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేదని ఆరోపించారు.
బయటికి ఒకటి.. లోపల మరో మాట చెప్పే తత్వం జనసేన పార్టీది కాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకు వచ్చినప్పుడు నాలుగు రోజుల్లోనే దానిమీద పవన్ కళ్యాణ్ స్పందించారని గుర్తు చేశారు. నాలుగు రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిశామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అలాగే ఎన్నో త్యాగాలతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితిలోనూ ప్రైవేటీకరించవద్దని బలంగా కోరామని గుర్తు చేశారు.
తుది దశకు యువశక్తి సభ ఏర్పాట్లు….
జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగనున్న యువశక్తి సభకు ప్రాంగణం సిద్ధమైంది. స్టేజ్ నిర్మాణం, బారికేడింగ్, భద్రత ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని రకాల భద్రత పరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నాలుగు రోజులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధాన వేదిక, ప్రాంగణం మొత్తం తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణానికి తుది మెరుగులు దిద్దేందుకు వీలుగా కార్యక్రమాల నిర్వహణ విభాగానికి పలు సూచనలు చేశారు. రణస్థలం యువశక్తి సభ ఏర్పాట్లను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక పరిశీలించారు.
టాపిక్