Nadendla Manohar: జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి, స్థలాల కొనుగోలు.. ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు-jagmantha corruption in jagananna colonies purchase of land ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nadendla Manohar: జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి, స్థలాల కొనుగోలు.. ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు

Nadendla Manohar: జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి, స్థలాల కొనుగోలు.. ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు

Sarath chandra.B HT Telugu
Aug 05, 2024 07:09 AM IST

Nadendla Manohar: 'ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాదని ఆహార, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

చెరువులా మారిన జగనన్న కాలనీల ఫోటోలు తీస్తున్న నాదెండ్ల మనోహర్
చెరువులా మారిన జగనన్న కాలనీల ఫోటోలు తీస్తున్న నాదెండ్ల మనోహర్

Nadendla Manohar: వైసీపీ హయంలో పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లు, గృహ నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారని నాదెండ్ల ఆరోపించారు. రైతుల నుంచి ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాలుగైదు రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పారు.

ప్రజా ధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని త్వరలోనే పెంచుతామని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

తెనాలి నియోజకవర్గంలో గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు పెదరావూరు, సిరిపురం, దావులూరు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మిస్తున్న లే అవుట్లను పరిశీలించారు. లబ్ధిదారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కాగితాల్లో చూపించిన దానికి, వాస్తవ పరిస్థితికి అసలు పొంతన లేదని, వందల కోట్లు ఖర్చు అయినట్లు చూపిస్తున్నారు తప్ప కనీసం కాలనీల్లో మౌలిక వసతులు కల్పించలేకపోయారన్నారు.

చెరువుల్లా మారిన లే అవుట్లు..

చిన్నపాటి వర్షానికి లే అవుట్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, తాగు నీరు, కరెంటు.. ఇలా ప్రతీది సమస్యేనని, పట్టాలు ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులు తమకు మంజూరు చేసిన స్థలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. మరికొంత మంది లబ్ధిదారులను ఇళ్లు నిర్మిస్తామని డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్లు మోసం చేశారని అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నాయని ఆరోపించారు.

78 ఎకరాలు... రూ.399 కోట్లా?

పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం పెదరావురులో 78 ఎకరాల స్థలం కొన్నారని, ఇక్కడ రైతుల నుంచి ఎకరా రూ.90 లక్షల నుంచి కోటి రూపాయలకు కొనుగోలు చేశారని ప్రభుత్వానికి మాత్రం రూ.399 కోట్లకు విక్రయించారని నాదెండ్ల చెప్పారు. ఇక్కడ ఒక్క చోటే దాదాపు రూ.300 కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఈ లే అవుట్లో 3792 మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారని మొదటి విడతలో 1900 ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉన్నా నాలుగేళ్లు అవుతోన్న ఇప్పటికి నిర్మించింది 489 ఇళ్లేనని నాదెండ్ల అన్నారు. అరకొర వసతులతో వాటిని నిర్మించారని చెప్పారు. సిరిపురం లేఅవుట్ లో 9735 లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు అయ్యాయని మొదటి విడతలో 3338 ఇళ్లు నిర్మించాల్సి ఉన్నా ఇప్పటికి నిర్మించింది 250 ఇళ్లేనని నివాసం ఉంటున్నది మూడు కుటుంబాలే అన్నారు. దవులూరు లే అవుట్లో 356 ఇళ్లు మంజూరు అయితే పూర్తి చేసింది 86 మాత్రమేనని ప్రతి లే అవుట్లో సవాలక్ష సమస్యలు ఉన్నాయన్నారు.

నెల రోజులు సమయం ఇవ్వండి..

తెనాలి నియోజకవర్గం పరిధిలో ఉన్న మూడు లేఅవుట్లను వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని, వచ్చే ఉగాదికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిగేలా చూస్తామన్నారు. అంతకు ముందు ఈ నెల రోజుల్లో ఎవరి ఇళ్ల స్థలం ఎక్కడుందో అర్థమయ్యే విధంగా లేఅవుట్ బయట రోడ్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ తో బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. లబ్ధిదారులను మోసం చేసిన కాంట్రాక్టర్లకు రెండు వారాల సమయం ఇస్తున్నామని, మధ్యలో వదిలేసిన ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టకపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

Whats_app_banner