Nara Bhuvaneswari : చంద్రబాబు సింహంలా బయటకొస్తారు, మాకు ప్రజల డబ్బు అవసరం లేదు- నారా భువనేశ్వరి-jaggayyapeta nara bhuvaneswari criticizes ysrcp govt illegally arrested chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Jaggayyapeta Nara Bhuvaneswari Criticizes Ysrcp Govt Illegally Arrested Chandrababu

Nara Bhuvaneswari : చంద్రబాబు సింహంలా బయటకొస్తారు, మాకు ప్రజల డబ్బు అవసరం లేదు- నారా భువనేశ్వరి

Bandaru Satyaprasad HT Telugu
Sep 25, 2023 04:57 PM IST

Nara Bhuvaneswari : స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు నిరసన తెలుపుతుంటే సీఎం జగన్ భయంపట్టుకుందన్నారు.

నారా భువనేశ్వరి
నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari : సింహం లాంటి చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టించి ఉండొచ్చు.. ఆయన ఇకపై ప్రజల కోసం మరింత కసిగా పనిచేస్తారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మా కుటుంబానికి ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల సొమ్ముకు ఆశపడితే ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోతుందన్నారు. చంద్రబాబు ప్రజల మనిషి అని భువనేశ్వరి అన్నారు. జగ్గంపేట దీక్షా శిబిరంలో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారని ప్రశ్నించారు. మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదన్నారు. హెరిటేజ్‌లో 2 శాతం అమ్మినా రూ.400 కోట్లు వస్తాయని తెలిపారు. మానవుడే దేవుడని ఎన్టీఆర్ నమ్మారని, ఆ మార్గంలోనే మేము పెరిగామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

స్కిల్ డెవలప్మెంట్ తో సీఈవోల స్థాయికి

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని భువనేశ్వరి తెలిపారు. ట్రస్ట్ ద్వారా వేలాది మందిని చదివిస్తున్నామని గుర్తుచేశారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు గురించే ఆలోచిస్తారన్నారు. ఏపీని ఎలా అభివృద్ధి చేయాలని ఆయన ఆలోచించారన్నారు. రాష్ట్ర ప్రజల కోసమే ఆయన జైలుకు వెళ్లారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది లబ్దిపొందారని భువనేశ్వరి తెలిపారు. ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు హైదారాబాద్ నుంచి రాజమండ్రికి వస్తే వారిని పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి రావడానికి పాస్ పోర్ట్‌లు కావాలా? అని ప్రశ్నించారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా చాలా మంది ఉపాధి పొందారని, సొంతంగా కంపెనీలు పెట్టుకుని సీఈవో స్థాయికి ఎదిగారన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేపట్టినా వైసీపీ ప్రభుత్వం భయపడుతుందని భువనేశ్వరి అన్నారు.

తెలంగాణ నుండి ఏపీకి రావడానికి వీసా కావాలా?

"చంద్రబాబు సింహంలా బయటకొచ్చి ప్రజల కోసం మళ్లీ పని చేస్తారు. బ్రిటిష్ పాలకుల కాలంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి వ్యక్తులు జైలుకు వెళ్లారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజల కోసం జైలుకు వెళ్లారు. రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటం తప్పా? స్కిల్ డెవలెప్మెంట్ ద్వారా లబ్ది పొందిన వారు ఉన్నత స్థానాల్లో ఉండి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. యువత జీవితాలు మార్చడం తప్పా? మా కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం వస్తుంటే పోలీసులు భయపెట్టి ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సెల్ ఫోన్లు కూడా లాక్కున్ని వారి సమాచారం తెలుసుకున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నా. తెలంగాణ నుండి ఏపీకి రావడానికి వీసా కావాలా? ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలకు ఎక్కడికైనా వెళ్లే హక్కుంది. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఎప్పుడూ బయటకు రాని మహిళలు చంద్రబాబు కోసం బయటకు వచ్చారు."- భువనేశ్వరి

అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు

జగ్గంపేట నిరసన దీక్షలో పాల్గొనకముందు అన్నవరం సత్యనారాయణస్వామి వారిని నారా భువనేశ్వరి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, జ్యోతుల నవీన్, ఎన్.ఎస్.వీ.వర్మ, యనమల దివ్య, యనమల కృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ సెటైర్లు

సింహం లాంటి చంద్రబాబును జైలులో పెట్టారన్న నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ సెటైర్లు వేసింది. నక్కను తెచ్చి మీరు సింహం అని లేనిపోని ఎలివేషన్లు ఇవ్వకండి మేడమ్ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. నక్క గర్జించినా ఏం కాదు... ఆయనేం చేసేది ఉండదన్నారు. ఆయన్ను గొడ్డుకన్నా హీనం.. పశువుకన్నా ఘోరం అని ఎన్టీఆర్ స్వయంగా చెబితే మీరేమో ఆయన్ను సింహం అంటుంటే ప్రజలకు నవ్వొస్తోందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తోందని, ఆయన్ను డిస్టర్బ్ చేయొద్దన్నారు.

WhatsApp channel