Oil Prices in AP | ఉక్రెయిన్- రష్యా మంటలు - వంటింట్లో కాక...
ఏపీలో వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నూనెల ధరలు పెరగటానికి గల కారణం.. ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధమే అని చర్చ నడుస్తోంది. అయితే వ్యాపారులే వంట నూనెల కొరత సృష్టించారని.. వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీంతో ఏపీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఉక్రెయిన్ - రష్యా వార్ ప్రభావం కాస్త మన వంటింట్లో కాక పుట్టిస్తోంది. ఒక్కసారిగా పెరిగిన ధరలతో రాష్ట్రంలోని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఇదంతా కేవలం కృతిమ కొరతనే వాదన వినిపిస్తోంది. ఉక్రెయిన్ -రష్యా యుద్ధాన్ని సాకుగా చూపుతూ.. దోచుకునే వ్యూహాంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సోదాలు చేపట్టారు. ఇందులో పలుచోట్ల అధికస్థాయిలో నూనె నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
విజిలెన్స్ తనిఖీలు.. పలుచోట్ల కేసులు..!
వినియోగదారుల్ని దోచుకుంటున్న వంటనూనెల వ్యాపారులే లక్ష్యంగా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ మార్టులు, గోదాముల్లో సోదాలు చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి.. సామాన్యులను దోచుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారుల్ని హెచ్చరించారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలోని పలు దుకాణాల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఓ దుకాణాన్ని సీజ్ చేశారు. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలోని పలు దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు అధికారులు. వంట నూనెలను అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. నిర్వాకులపై కేసులు నమోదు చేయగా.. పలు షాపులకు తాళాలు వేశారు.
దేశవ్యాప్తంగానూ వంట నూనెల ధర మండుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఆయిల్ ధరలు మార్కెట్లో ఒక్కసారిగా పెరిగిపోయాయి. నిజానికి ఇది ఉక్రెయిన్ -రష్యా పెట్టిన మంటా? లేదంటే వ్యాపారులే సృష్టిస్తున్న కృత్రిమ కొరతా..? అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. యుద్ధాన్ని సాకుగా చూపి ధరలను అమాంతం పెంచేశారు. ఎమ్మార్పీ ధరలు వేరుశనగ నూనె రూ. 165, పామాయిల్ రూ. 120, పొద్దుతిరుగుడు నూనె లీటరు రూ. 135 ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎమ్మార్పీ కన్నా రూ. 30 నుంచి 40 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో ధరలు ఈ స్థాయిలో పెరగడంతోనే ఏపీలోని అధికారులు అప్రమత్తమయ్యారు. విజిలెన్స్ అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు వెనకాడమని హెచ్చరిస్తున్నారు.
టాపిక్